‘సర్‌’ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి

Jul 26 2026 2:08 AM | Updated on Jul 26 2026 2:08 AM

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

భూపాలపల్లి: జిల్లాలో డబుల్‌ ఓటు లేకుండా సర్‌ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌, పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతీ యువత ఓటరుగా నమోదు కావాలని, అందుకు రాజకీయ పార్టీలు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది తప్పనిసరిగా ఎన్యుమరేషన్‌ ఫారాలు సమర్పించాలన్నారు. జిల్లాలో డిజిటలైజేషన్‌ ప్రక్రియ 84.12 శాతం పూర్తి అయిందని, అయితే పురపాలక పరిధిలో 70 శాతం జరిగిందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్‌ లక్ష్మీరాజయ్య, ఎన్నికల విభాగం డిటీ అబ్బాస్‌, నవీన్‌, ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లాకు నూతన సీపీఓగా అదనపు బాధ్యతలు స్వీకరించిన కిష్టయ్య కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

‘సోలార్‌’ పనులు

వేగవంతం చేయాలి

కాటారాన్ని మోడల్‌ సోలార్‌ విలేజ్‌గా తీర్చిదిద్దే పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన కింద మోడల్‌ సోలార్‌ విలేజ్‌గా ఎంపికై న కాటారం మండలకేంద్రంలో సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్లాంట్ల ఏర్పాటుపై రెడ్‌కో, విద్యుత్‌, పంచాయతీరాజ్‌ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. టీజీఎన్పీడీసీఎల్‌ పరిధిలోని క్లస్టర్‌–3 కింద కాటారం గ్రామంలో మొత్తం 700 గృహాలకు 1,400 కిలోవాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రతీ ఇంటికి 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్‌ రూఫ్‌టాప్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టును విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, రెడ్‌కో డీఎం రాజేందర్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ రమేశ్‌, డీపీఓ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement