● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్‌కుమార్
భూపాలపల్లి అర్బన్: విద్యార్థులకు చట్టాలు, శిక్షలపై అవగాహన ఉంటే ర్యాగింగ్, పోక్సో వంటి నేరాలకు దూరంగా ఉంటారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్ కుమార్ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసంపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల, గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూనూరు సురేష్‌కుమార్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కంప అక్షయ, ప్రిన్సిపాల్ బాలునాయక్, న్యాయవాది రవికుమార్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, హెచ్‌ఎంఆర్‌డీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దివ్యాంగ విద్యార్థుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలను పరిశీలించి, ఆహార నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి.అఖిల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూనూరు సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


