భూపాలపల్లి: ఆధునిక సాంకేతికతను సమర్థంగా వినియోగించినప్పుడే అభివృద్ధి వేగవంతమవుతుందని కలెక్టర్ రాహుల్‌శర్మ స్పష్టం చేశారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం టీ పైబర్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ డెఫిషియన్సీ ఆధ్వర్యంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏఐ ఆధారిత సాధనాల వినియోగం ఫైళ్ల నిర్వహణ, నివేదికల తయారీ డేటా విశ్లేషణ, సమయాన్ని ఆదా చేసే విధానాలు ప్రజా సేవల్లో సాంకేతికత పాత్ర వంటి అంశాలపై నిపుణులు వివరించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ఏఐ సాంకేతికతను ప్రభుత్వ పనుల్లో సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రతి అధికారి, ఉద్యోగికి శిక్షణ అవసరమని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఐఏఎస్ అధికారులకు కూడా ఏఐపై శిక్షణ ఇస్తున్న నేపథ్యంలో జిల్లా స్థాయిలో అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం అవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ‘తెలంగాణ రైజింగ్–2047’ సాధనలో జిల్లాల అభివద్ధి కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుతం అనేక మంది అధికారులు చాట్ జీపీటీ, క్లౌడ్ వంటి ఏఐ సాధనాలను ఉపయోగిస్తున్నారని, అయితే వాటిపై పూర్తిగా ఆధారపడకుండా జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. ఏఐ పనులను సులభతరం చేసే సాధనమే కానీ, తుది నిర్ణయం అధికారులదే అని స్పష్టం చేశారు. ఏఐ ఇచ్చే సమాచారం, సూచనలను తప్పనిసరిగా ధవీకరించిన తర్వాతే వినియోగించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా పరిపాలనలో ఉపయోగిస్తున్న కొన్ని ఏఐ సాధనాలను అధికారులకు ప్రాక్టికల్‌గా ప్రదర్శించి, వాటి వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఏఐ నిపుణులు ధీరజ్, రాహుల్, ఈడీఎం శ్రీకాంత్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


