భూపాలపల్లి అర్బన్: జిల్లాలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సీసీఎస్ పోలీసులు నార్కొటిక్ డాగ్ సహాయంతో గురువారం పట్టణంలోని రాంనగర్, కాకతీయ కాలనీ, జంగేడు, ఖాసింపల్లి ప్రాంతాల్లో గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు, గంజాయి వినియోగదారుల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల సందర్భంగా నిందితులు, వినియోగదారులు, వారి కుటుంబ సభ్యులకు గంజాయి విక్రయం, రవాణా, నిల్వ, వినియోగం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. సంబంధిత నేరాలపై నిరంతర నిఘా కొనసాగుతోందని, భవిష్యత్‌లో ఎవరైనా సేవించడం, సంబంధిత నేరాల్లో పాల్గొన్నట్లు గుర్తిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా నార్కోటిక్ డాగ్ సహాయంతో ప్రత్యేక తనిఖీలు, నిఘా చర్యలు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.


