భూపాలపల్లి అర్బన్/గణపురం/ మల్హర్: సింగరేణి ప్రభావిత గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సింగరేణి ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం భూపాలపల్లి ఏరియా కేటీకే ఓసీ–3 ప్రాజెక్టును సందర్శించి మెగా ప్లాంటేషన్‌లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గనిలో వర్షపు నీరు నిల్వ కాకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేయాలన్నారు. స్లోప్‌ల స్థిరత్వంపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, భద్రతా ప్రమాణాల అమలులో రాజీ పడవద్దని సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి మహావక్షాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. గనుల ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు సింగరేణి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తదుపరి ప్రతిపాదిత తాడిచర్ల ఓసీ–2 ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి స్థల పరిస్థితులు, ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. అనంతరం శాత్రాజ్‌పల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామ పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, పునరావాస అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి, స్థానిక ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి, ఏజీఎంలు రవికుమార్, జ్యోతి, పీఓలు శ్యాంసుందర్, రామస్వామి, డీజీఎం రాజేశ్వర్, ఏరియా ఇంజనీర్ పి.వి. సాంబశివరావు, ఏరియా సర్వే ఆఫీసర్ శైలేంద్ర కుమార్, కేటీకే–1 గ్రూప్ ఏజెంట్ తిరుపతి, ప్రాజెక్టు మేనేజర్ రాంబాబు, వివిధ విభాగాల అధికారులు, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఎంఓఏఐ కార్మిక సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
సింగరేణి ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్
డైరెక్టర్ వెంకటేశ్వర్లు


