భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య కోరారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డిని కలిసి కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గట్టయ్య మాట్లాడుతూ.. ట్రబ్ రిపేర్‌కు అవసరమైన సామగ్రి (వీల్స్, బోల్ట్స్, పెడస్టల్స్, క్లాంప్స్) సకాలంలో అందుబాటులో ఉంచాలన్నారు. కోల్ కట్టర్స్‌కు అవసరమైన బిట్స్, డ్రిల్లింగ్ రాడ్స్ కొరతను వెంటనే తీర్చాలని కోరారు. కేటీకే–5వ గనిలో మ్యాన్ రైడింగ్ ఎక్స్‌టెన్షన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అన్ని గనుల రహదారులపై స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, రీజినల్ క్యాప్సూల్స్ సరఫరాను సక్రమంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులకు నాణ్యమైన కంపెనీ షూస్, హెల్మెట్లు, యూనిఫాంలు అందజేయాలని చెప్పారు. ఎస్‌డీఎల్ యంత్రాలను కొత్తవిగా కొనుగోలు చేసి అవసరమైన విడిభాగాలను సమకూర్చాలని కోరారు. జనరల్ మేనేజర్ కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు త్వరలోనే చేపడతామని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు దాసరి జనార్దన్, గోడిసెల శ్రీహరి, రాజు, మనోజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


