నేర నియంత్రణలో చురుగ్గా పనిచేయాలి
● ఎస్పీ సంకీర్త్
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో నేర నియంత్రణలో పోలీస్ అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శనివారం జిల్లాస్థాయి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెలవారీ సమీక్షలో భాగంగా జిల్లాలో నేర నియంత్రణ, శాంతి–భద్రతల పరిరక్షణ, ప్రజలకు అందించిన సేవల విషయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది కనబరిచిన పనితీరును అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ కేసులో నాణ్యమైన, బాధ్యతాయుతమైన దర్యాప్తు జరగడం వల్లనే బాధితులకు న్యాయం చేకూరుతుందన్నారు. నేరస్తులకు తప్పనిసరిగా శిక్ష పడేలా అధికారులు సమర్థవంతంగా పనిచేశారన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే సంవత్సరంలో కూడా ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, జాప్యం లేకుండా విచారణ పూర్తి చేయాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాల ద్వారా విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని, అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షణ చేయాలన్నారు. దొంగతనాల కేసుల్లో ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి సొత్తు రికవరీ చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి తగిన ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. మండల కేంద్రాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసింగ్‌ను కఠినంగా అమలు చేయాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరేష్‌కుమార్, డీఎస్పీ సంపత్‌రావు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, ఇన్‌స్పెక్టర్లు, జిల్లాలోని ఎస్సైలు పాల్గొన్నారు.
నేర నియంత్రణలో చురుగ్గా పనిచేయాలి


