మేడారానికి బస్సు సర్వీసులు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో భూపాలపల్లి నుంచి మేడారానికి ముందస్తుగా ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించినట్లు భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతీ రోజు ఉదయం 8గంటలకు, 9గంటలకు, సాయంత్రం 4గంటలకు, 5గంటలకు రాత్రి 10గంటలకు భూపాలపల్లి నుంచి మేడారానికి సర్వీసులు నడుపుతున్నట్లు చెప్పారు. తిరుగు ప్రయాణంలో మేడారం నుంచి ఉదయం 10:40గంటలకు, 11:40గంటలకు సాయంత్రం 6:45 గంటలకు రాత్రి 7:45గంటలకు బస్సులు ఉంటాయన్నారు. భూపాలపల్లి నుంచి గణపురం, ములుగు, పస్రా, తాడ్వాయి మీదుగా మేడారం చేరుకుంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రయాణికుల రద్దీ పెరిగితే అవసరమైతే అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేస్తామన్నారు.
హరేకృష్ణ రథోత్సవం
భూపాలపల్లి అర్బన్: బంజారాహిల్స్ గోల్డ్‌న్ టెంపుల్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జిల్లా కేంద్రంలో హరినామ నగర సంకీర్తన రథోత్సవం నిర్వహించారు. స్థానిక హన్‌మాన్ దేవాలయం నుంచి జయశంకర్ సెంటర్ వరకు సంకీర్తన చేపట్టారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న ఈ రథయాత్రను ఆలయ ధర్మకర్తలు గండ్ర జ్యోతి జెండాఊపి ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కృష్ణగీతాలు, డప్పుచప్పుళ్లతో నృత్యాలు చేపట్టారు. శ్రీవారి నామస్మరణం, హరేకృష్ణ కీర్తనలతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బుర్ర రమేష్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రామప్పలో భక్తుల సందడి
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేయగా ఆలయ విశిష్టత గురించి గైడ్‌లు విజయ్‌కుమార్, వెంకటేశ్‌లు వివరించారు. రామప్ప ఆలయాన్ని సందర్శించిన అనంతరం సరస్సు కట్టకు చేరుకొని సరస్సులో బోటింగ్ చేస్తూ సరస్సు అందాలను తిలకించారు.
మేడారానికి బస్సు సర్వీసులు ప్రారంభం


