మేడారంలో ఎస్పీ పర్యటన
ఏటూరునాగారం: నేడు ఆదివారం కావడంతో వనదేవతలను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా చర్యల్లో భాగంగా ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శనివారం మేడారం పర్యటించారు. గద్దెలకు భక్తులు చేరుకునే మార్గాలు, దర్శనం అనంతరం బయటకు వెళ్లే ప్రాంతాలను పరిశీలించి అక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. అలాగే వాహనాలను మళ్లించాలన్నారు. నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు పెడితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పోలీసులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అలాగే గద్దెల వద్ద జరుగుతున్న సాలారం పనులు పరిశీలించారు.
కోళ్ల షాపులకు దరఖాస్తుల ఆహ్వానం
ఏటూరునాగారం: మేడారం మహా జాతరలో కోళ్ల దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు గిరిజనులు, గిరిజన మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1 నుంచి ఐటీడీఏ ఏటూరునాగారం, మేడారం ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో ఉచితంగా దరఖాస్తులను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ దరఖాస్తులను జనవరి 15వ తేదీ సాయంత్రం 5గంటలోపు సమర్పించాలని సూచించారు. ఒక్కో షాపునకు రూ.16వేలు ఐటీడీఏ ఏటూరునాగారం పేరుతో డీడీ తీయాలని వెల్లడించారు. షాపు పెట్టాలనుకునే దుకాణం దారుడు షాపు ఎక్కడ నిర్వహిస్తున్నాడనే లొకేషన్, ఆధార్‌కార్డు, ప్లాట్ యజమాని వివరాలను విధిగా దరఖాస్తు ఫారంతో జత చేసి ఇవ్వాలని సూచించారు. అనంతరం అర్హులైన వారికి జనవరి 22వ తేదీలోపు దరఖాస్తులను పరిశీలించి లైసెన్స్, ప్రొసిడింగ్స్ అందజేస్తామని వివరించారు.


