సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం
విద్యారణ్యపురి: యూపీఎస్‌సీ సివిల్స్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష–2025 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం అభ్యర్థులు 4,141 మందికి గాను హనుమకొండ జిల్లాలో 10 పరీక్ష కేంద్రాలు కేటాయించారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్‌లో 2,435 మంది(58.80శాతం), మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షకు 2,422మంది(58.49శాతం)మంది హాజరైనట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు సంబంధించి అడ్మిట్‌కార్డుతోపాటు గుర్తింపు కార్డు పరిశీలించడంతోపాటు క్షుణ్ణంగా తనిఖీ చేశాకే ఉదయం 9 గంటల వరకు లోనికి అనుమతించారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్‌కాలేజీ, ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాల కేంద్రాలను కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు.
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
గణపురం: కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో ఆదివారం స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు జూలపల్లి నాగరాజు ఆయనను సాదరంగా ఆహ్వానించి గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోటగుళ్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పూల మాలలు, శాలువాతో ఘనంగా సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందించారు. కోటగుళ్ల సందర్శన ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని, ఆలయ శిల్ప సంపద అద్భుతమని ఆనందం వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి గాయాలు
రేగొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన ఘటన మండలంలోని రూపిరెడ్డిపల్లి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దుంపిల్లపల్లి గ్రామానికి చెందిన కొండ్ల వేణు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వ్యక్తిగత పనుల నిమిత్తం పరకాలకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో జూకల్ నుంచి పరకాలకు వెళుతున్న ఆటో రూపిరెడ్డిపల్లి వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో వేణుతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న బొల్లికొండ శివవర్ధన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న మంత్రి సీతక్క తన కాన్వాయ్‌ను ఆపి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో పరకాలలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మానవతా దృక్పథాన్ని చాటుకున్న మంత్రి సీతక్కకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం


