‘భూ భారతి’తో భూములకు హక్కులు
భూపాలపల్లి: నూతన భూ భారతి చట్టంతో భూముల హక్కులకు భద్రతతో పాటు భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏఎస్‌ఆర్ గార్డెన్‌లో జరిగిన భూ భారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టం అవగాహన సదస్సుకు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా భూ భారతి చట్టంలోని అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, ధరణి పేరుతో ప్రజల భూములను దోపిడీ చేశారని, అనేక అక్రమాలు చేసి వాళ్ల కడుపులు నింపుకున్నారని ఆరోపించారు. కొత్తపల్లి(ఎస్‌ఎం) గ్రామంలో సుమారు 70 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు, పాస్‌బుక్‌లు రాకపోవడంతో రైతుబంధు, రైతు బీమా, బ్యాంకు రుణాలు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నూతన చట్టం ప్రకారం వారందరికీ హక్కులు కల్పిస్తామన్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. భూ భారతితో అన్ని రికార్డులు పకడ్బందీగా నమోదు చేయబడతాయన్నారు. సాగులో ఉంటే విచారణ నిర్వహించి పట్టా ఇచ్చే అవకాశం ఉందన్నారు. భూ భారతి చట్టంలో లబ్ధిదారులకు మేలు చేసే విధంగా రూపొందించారన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్‌రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఆర్డీఓ రవి, తహసీల్దార్ శ్రీనివాసులు, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్‌కుమార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
ఇక పకడ్బందీగా భూ రికార్డులు
కలెక్టర్ రాహుల్ శర్మ


