నిర్వహణలేని ‘వనాలు’
కనిపించని మొక్కలు..
నీరులేక ఎండుతున్న మొక్కలు
భూపాలపల్లి రూరల్: వృక్ష సంపదను పెంచి గ్రామపంచాయతీలకు ఆదాయం సమకూర్చేందుకు గత ప్రభుత్వం బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. కొన్నేళ్ల క్రితం చేపట్టిన ఈ కార్యక్రమంతో ప్రజలకు ప్రయోజనం ఉందా.. లేదనేది పక్కన బెడితే నిధులు మాత్రం రూ.లక్షలు ఖర్చయ్యాయి. బృహత్ పల్లె ప్రకృతివనాల ఏర్పాటులో భాగంగా అధికారులు హడావుడిగా ప్రభుత్వ స్థలాలను గుర్తించి మొక్కలు నాటించారు. కొన్నిచోట్ల ఆదరబాదరగా స్థలాలను గుర్తించిన అధికారులు.. నామమాత్రంగా మొక్కలు నాటించి మమ అనిపించారు. ఒక్కో బృహత్ ప్రకృతివనంలో దాదాపు 3వేల నుంచి 30 వేలలోపు మొక్కలు నాటినట్లు లెక్కలు చూపించి రూ. 2.26 కోట్లు ఖర్చు చేశారు. అయితే ప్రకృతి వనాలు ఏర్పాటు చేసిన స్థలాలు చౌడు, గుట్ట నేలలు కావడంతో నాటిన మొక్కలు చాలా వరకు పెరగడం లేదు. గ్రామాలకు దూరంగా ఏ ర్పాటు చేయడంతో తదితర మండలాల్లో నాటిన మొక్కలు కనిపించకపోగా.. బోర్డులు, గేట్లను ఎత్తు కు పోయారు, పల్లె ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారింది.
11 మండలాల్లో ఏర్పాటు
జిల్లాలోని 11 మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతివనాలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ప్రతీ మండలానికి బృహత్ వనాన్ని కేటాయించారు. తర్వాత వాటి సంఖ్యను 5కు పెంచారు. జిల్లాలో మొత్తం 55 బృహత్ పల్లె ప్రకృతివనాలను ఏర్పాటు చేశారు. 5 ఎకరాల పరిధిలో వనాలు పెంచేందుకు ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల గ్రామాలకు దూరంగా ఏర్పా టు చేసి, కంచె ఏర్పాటు చేయకపోవడంతో పశువులు, మేకలు మొక్కలను తినేస్తున్నాయి.
బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో నేరేడు, చింత, సీతాఫలం, మారేడు, తంగేడు, కానుగ, టీకోమా, నిమ్మ, గుల్మహార్, జామ, మామిడి, బేరు, వెదురు, పనస వంటి మొక్కలతో పాటు భారీ వృక్షాలుగా ఎదిగే మొక్కలను నాటారు. అయితే ప్రస్తుతం అక్కడక్కడ జామ ఇతర మొక్కలు తప్ప ఇతర మొక్కలు కనిపించడం లేదు. బృహత్ వనాలను సంరక్షించేందుకు వానాకాలం మినహా మిగతా రోజుల్లో ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీరు పట్టడానికి ఇద్దరు కూలీలకు డబ్బులు చెల్లిస్తున్నారు. అయినా ఆశించిన ఫలితంలేదు.
బోర్డులు, గేట్లను ఎత్తుకెళ్లిన వైనం
రూ.లక్షల్లో ప్రజాధనం వృథా
జిల్లాలో 55 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు
నిర్వహణలేని ‘వనాలు’


