సాగు విస్తీర్ణం అంచనా..(ఎకరాల్లో..)
రూ.7,500 సాయం ఎప్పుడో..
వరి 98,000
మొక్కజొన్న 30,000
పెసర 150
ఇతర పంటలు 300
● నారుమళ్లు సిద్ధంచేసిన రైతులు
● పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపు
కాటారం: పంట సాగు పెట్టుబడి కోసం రైతులకు ప్రతీ సీజన్‌లో ప్రభుత్వం ద్వారా అందుతున్న సాయం ఈ సీజన్‌లో ఇప్పటికీ అందలేదు. యాసంగి సీజన్ ప్రారంభమై రైతులు పంట సాగుకు సిద్ధమవుతున్నప్పటికీ రైతు భరోసాపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. రైతులు ఇటీవల వానాకాలం పంట సాగు పూర్తిచేసి ధాన్యం విక్రయిస్తున్నారు. మరో పక్క యాసంగి కోసం పొలాలు చదును చేసి నారుమళ్లను సిద్ధం చేస్తున్నారు. ఈ సమయంలో రైతులకు దుక్కి దున్ని, పొలాలు సిద్ధం చేసుకోవడం, విత్తనాలు, ఎరువులు సమకూర్చుకోవడం కోసం కొంత డబ్బు అవసరం పడుతుంది. దీంతో రైతులు ప్రభుత్వం ద్వారా అందే రైతుభరోసా కోసం ఎదురు చూస్తున్నారు.
జిల్లాలో 2.70లక్షల ఎకరాల భూమి..
జిల్లాలో 2.70 లక్షల ఎకరాల పైచిలుకు వ్యవసాయ సాగు భూములు ఉండగా 1,13 లక్షల మంది రైతులు ఉన్నారు. వానాకాలం సీజన్‌లో సుమారు 2.40 లక్షల ఎకరాల భూమిలో పత్తి, వరి, ఇతరత్రా పంటలు సాగు చేశారు. యాసంగి సీజన్‌లో పత్తి సాగు ఉండకపోగా కేవలం 1.28 లక్షల భూమిలో వరి, మొక్కజొన్న కూరగాయల పంటలు సాగు జరిగే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గడిచిన వర్షాకాలంలో అతివృష్టి కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టాన్ని చవిచూశారు. నష్టపోయిన పంటలకు నేటికీ పరిహారం సైతం అందలేదు. ఈ యాసంగి సీజన్‌లో సకాలంలో పంటలు సాగు చేసుకుందామంటే సాగుకు పెట్టుబడి కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఏటా పెరుగుతున్న ఖర్చులు..
ఏటా పంట పెట్టుబడి ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. అధిక దిగుబడులు ఇచ్చే హైబ్రిడ్ విత్తనాలు సాగుచేయాలనే తపనతో రైతులు వివిధ కంపెనీల మాయమాటలు నమ్మి రైతులు అధికంగా విత్తనాల కోసం డబ్బులు వెచ్చిస్తున్నారు. ఒక్క ఎకరాకు విత్తనాల కోసమే రూ.5వేల నుంచి రూ6.వేల వరకు చెల్లిస్తున్నారు. ఇక దుక్కులు దున్నడం, రసాయన ఎరువులు, కలుపు మందులు, పురుగు నివారణ మందులు, నాటుకు ఎకరాకు రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు వస్తోంది. పెట్టుబడి సాయం సకాలంలో చేతికి అందితే వాటికి కొంత కలుపుకొని పంట సాగులో ముందుకు వెళ్లవచ్చని రైతులు ఆశపడుతున్నారు.
రైతులకు పెట్టబడిలో సాయం అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధుకు శ్రీకారం చుట్టింది. ఎకరాకు రూ.6వేలు పెట్టుబడి సహాయం అందిస్తూ వచ్చారు. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.7500 పెట్టుబడి సాయం పెంచి ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు పేరు రైతు భరోసాగా మార్పు చేసి ఎకరాకు రూ.6వేల చొప్పున అందిస్తూ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. పెరిగిన విత్తనాలు, ఎరువులు, పెట్టుబడితో రూ.6వేలు రైతులకు ఎటూ సరిపోవడం లేదు.


