రక్కసి
‘రమ్మీ’
గేమింగ్ ముసుగులో ఆన్‌లైన్ జూదం
సాక్షిప్రతినిధి, వరంగల్:
● ‘నా ఫ్రెండ్ రూ.500 పెట్టి రూ.1,500 గెలిచాడు. నేనూ ట్రై చేశా. 5 రోజుల్లో రూ.8,000 పోయాయి. చివరికి సెల్‌ఫోన్ అమ్మేశా.’
– ఇంజనీరింగ్ విద్యార్థి, వరంగల్
● ‘నాకు డబ్బు రావడం ప్రారంభమైన తర్వాత ఆడి రెఫరల్ గ్రూపులు క్రియేట్ చేశా. నా అకౌంట్లో డబ్బులు జమవుతాయని మెసేజ్ వచ్చింది. ఆఖరికి నా ఖాతా ఫ్రీజ్ అయ్యింది.’
– డిగ్రీ విద్యార్థి, నర్సంపేట
.. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రమ్మీ గేమింగ్ యాప్‌ల సంస్కృతి పెరుగుతోంది. రమ్మీ యాప్‌లు యువత జీవితాలపై బలమైన దాడి చేస్తున్నాయి. ‘గేమింగ్’ ముసుగులో జూదపు బానిసత్వం విస్తృతంగా వ్యాపిస్తోంది. ఫలితంగా అనేక మంది ఈ ఉచ్చులో చిక్కుకుని అప్పులు మూటగట్టుకుంటున్నారు. వాటిని తీర్చలేక చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు.
యాప్‌ల వ్యాప్తి..
ఉమ్మడి వరంగల్‌లో 2022 తర్వాత రమ్మీ యాప్ విష సంస్కృతి విచ్చలవిడి అయ్యింది. ప్రధానంగా నగరంలోని వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలతోపాటు మహబూబాబాద్, జనగామ, పరకాల, నర్సంపేట తదితర పట్టణాల్లో ఈయాప్‌ల వినియోగం గణనీయంగా పెరిగింది. ‘రమ్మీ కల్చర్’, ‘ఎ 23 రమ్మీ’, వెల్త్ రమ్మీ’, ‘జంగిల్ రమ్మీ’.. వంటి యాప్‌లు టాప్–డౌన్లోడెడ్‌గా ఉన్నాయి. టెలిగ్రామ్ చానల్స్ ద్వారా ‘100 శాతం గెలుపు ట్రిక్స్’, ‘మీకు మద్దతు అందించే రమ్మీ టీచర్స్’.. తదితర పేర్లతో ఇన్‌ఫ్లుయెన్సర్లు మోసం చేస్తూనే ఉన్నారు.
అందరూ టార్గెటే..
యూత్ నుంచి గృహిణుల దాకా.. అన్ని వర్గాలను ఈ రమ్మీ యాప్‌లు టార్గెట్ చేస్తూ విస్తరిస్తున్నాయి. బీటెక్, డిగ్రీ, ఇంటర్ విద్యార్థులు.. ఇలా అనేక మంది ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా హనుమకొండ, కాజీపేట, వరంగల్ ట్రైసిటీ పరిధి విద్యాసంస్థల్లో చదివేవారు, ప్రైవేట్ టీచర్లు, క్లర్కులు, ఆర్థిక ఒత్తిడిలో ఉన్న వర్గాలు, గృహిణులు ‘టైమ్ పాస్’గా మొదలుపెట్టి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నారు. వారం రోజుల వ్యవధిలో భారీగా డబ్బులు కోల్పోయిన సుమారు 20 మందికి పైగా వివిధ ప్రాంతాల్లో పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.
గేమ్ మాఫియా.. ‘బ్రోకర్’ వ్యవస్థ
ఉమ్మడి వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో రమ్మీ గేమ్ యాప్‌ల వినియోగం విచ్చలవిడిగా సాగుతున్నదని, వాటి పట్ల ఆకర్షితులు కావొద్దని సైబర్ క్రైమ్ పోలీస్‌లు ఇప్పటికి చాలా సార్లు హెచ్చరించారు. ప్రధానంగా వరంగల్ ట్రై సిటీలో మూడు టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా రెండు లక్షల రూపాయల వరకు రోజువారీ బెట్టింగ్ జరుగుతున్నట్లు సైబర్ పోలీసుల అనుమానం. ఈగ్రూపులకి ‘మాస్టర్ బ్రోకర్లు’ నిధులు సమకూరుస్తూ యువతకు ‘విజయం’ చూపించి మాయ చేస్తున్నట్లు సమాచారం.
హెల్ప్ డెస్క్ ప్రారంభించినప్పటికీ..
తెలంగాణ వ్యాప్తంగా సైబర్ సెల్ 2024లో ‘గేమింగ్ యాప్ మోసాల’పై స్పెషల్ హెల్ప్‌లైన్ ప్రారంభించింది. డిజిటల్ డిటాక్స్ క్యాంపెయిన్ ద్వారా పదుల సంఖ్యలో కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. అయితే యాప్‌లు విదేశీ సంస్థల ఆధీనంలో ఉండడం వల్ల వాటిపై నేరుగా చర్య తీసుకోవడం కష్టంగా మారుతోందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తద్వారా వారించే వారికన్నా గేమ్ యాప్‌లు వినియోగించే వారే ఎక్కువవుతున్నారని ఓ పోలీస్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.
కేరాఫ్‌గా మారిన ఉమ్మడి వరంగల్
‘టైమ్ పాస్’తో మొదలు..
అప్పుల ఊభిలోకి
ప్రాణాలు తీసుకుంటున్న యువత
అవగాహన కల్పిస్తున్నా మారని తీరు


