కాటారం: వేసవికాలంలో నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశించారు. కాటారం మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర రాహుల్‌శర్మతో కలిసి పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాటారం, భూపాలపల్లి డివిజన్లలో తాగునీటి సమస్య ఉండకూడదని, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్య పరిష్కరించాలని సూచించారు. సబ్‌డివిజన్ పరిధిలో 30 బోర్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని, అవసరం ఉన్న గ్రామాల్లో ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రభుత్వం ద్వారా మంజూరైన అభివృద్ది పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కాటారం హెడ్ క్వార్టర్స్‌లో మినీ స్టేడియం, చిల్డ్రన్స్ పార్క్ నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టాలని, నిర్మాణం పూర్తయిన గ్రామపంచాయతీ భవనాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని అన్నారు. డివిజన్ కేంద్రంలో మంజూరు చేసిన కూరగాయల మార్కెట్, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలని, అంబులెన్స్, వైకుంఠ రథాల ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు వేగంగా చేయాలని, భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇసుక లారీల వేగనియంత్రణకు స్పీడ్ గన్స్, ఇతరాత్ర చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను మంత్రి ఆదేశించారు. సరస్వతి పుష్కరాల ఏర్పాట్లలో వేగం పెంచాలన్నారు. సమీక్ష సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఆర్‌డీఓ నరేశ్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి పెద్దపీట
రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాటారం మండల కేంద్రంలోని మజీద్‌లో ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి మంత్రి మజీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇఫ్తార్ విందులో భాగంగా ముస్లింలకు స్వీట్లు, పండ్లు తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో ముస్లిం, మైనార్టీలకు పెద్దఎత్తున నిధులు కేటాయించిందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సందీప్, సమ్మయ్య, ప్రభాకర్‌రెడ్డి, అజీజ్ పాల్గొన్నారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
శ్రీధర్‌బాబు