లెప్రసీ మళ్లొస్తున్నది | - | Sakshi
Sakshi News home page

లెప్రసీ మళ్లొస్తున్నది

Mar 6 2025 1:54 AM | Updated on Mar 6 2025 1:50 AM

భూపాలపల్లి అర్బన్‌: అనారోగ్య సమస్యలతో పాటు.. అంగవైకల్యానికి ప్రధానంగా కుష్ఠు వ్యాధి కారణమవుతోంది. పూర్వీకులు ఈ వ్యాధి పూర్వజన్మ పాప ఫలితమని, వంశపారపర్యంగా వస్తుందని, నయం కాదని అనుకునేవారు. కొన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో వ్యాధి తీవ్రత తగ్గి వ్యాధిగ్రస్తులు తగ్గుతూ వస్తున్నారు. అంతరించి పోతుందనుకుంటున్న తరుణంలో మహమ్మారి మళ్లీ విస్తరిస్తోంది. ఉమ్మడి జిల్లాలో గత నెలలో వైద్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటి సర్వేలో మళ్లీ ఈ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో 62 మంది ఉండగా ఉమ్మడి జిల్లాలో 243 మంది బాధితులు ఉన్నారు. తీవ్రత పెరగకముందే అనుమానితులకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించేలా వ్యాధి నియంత్రణలో ప్రత్యేక దృష్టి సారిస్తేనే వ్యాధి నియంత్రణ ఉండే అవకాశం ఉంది.

వ్యాధి సోకేదిలా..

కుష్ఠు వ్యాధి మైక్రో బాక్టీరియం లెప్రే అనే బాక్టీరియా వల్ల సోకుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా చర్మానికి, నరాలకు సోకుతుంది. ఇది సాధారణంగా ఒకరకమైన అంటు వ్యాధి కారకం. కుష్టు వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా దగ్గరలో ఉన్న వారికి సోకే అవకాశం ఉంది. శరీరంలోని ఏ భాగంలోనైనా ఒకటి లేదా ఎక్కువ చిన్నవి లేదా పెద్ద మచ్చలు పాలిపోయిన రాగి లేదా ఎరుపు రంగులో ఉంటాయి. ఆ మచ్చలపై స్పర్శ, జ్ఞానం లేనప్పుడు, నొప్పి తెలియనప్పుడు మచ్చలపై చెమట పట్టదు. శరీరంపైన ఉన్న వెంట్రుకలు కూడా రాలి పోతాయి, చర్మంపై అక్కడక్కడా బుడిపెలు ఏర్పడతాయి. చెవి తమ్మెలు, ముఖం, చేతులు కాళ్లపై బుడిపెలు ఏర్పడతాయి. కాళ్లు, చేతులు, పాదాల్లో నిస్సత్తువ ఏర్పడి అంగవైకల్యానికి దారితీస్తాయి. పాదాల్లో గాయాలు ఏర్పడుతాయి. వ్యాధి సోకిన వారు కనురెప్ప పూర్తిగా మూయలేరు.

రెండు రకాలుగా చికిత్స

కుష్ఠు వ్యాధి సోకిన వ్యక్తికి ఒకటి నుంచి ఐదు మచ్చలు ఉంటే వారిని పాసీ బ్యాసిల్లరీ (పీబీ)గా గుర్తిస్తారు. వారికి ఆరు నెలలు వరకు ఖచ్చితంగా చికిత్స ఉంటుంది. కనీసం 9 నెలల్లో కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐదు కంటే ఎక్కువ మచ్చలు. ఉంటే వారిని మల్టీ బ్యాసిల్లరీ (ఎంబీ)గా గుర్తిస్తారు. అలాంటి వారికి 12 నెలలు చికిత్స ఉంటుంది. కనీసం 15 నెలల్లో కోర్సును పూర్తి చేయాలి. బహుళ ఔషధ చికిత్సతో కుష్ఠు వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. దాదాపు రూ.15 వేలు నుంచి రూ.20 వేలు వరకు ఖర్చయ్యే మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తారు. 6 నెలలు నుంచి 12 నెలల వరకు చికిత్స తీసుకుంటే కుష్ఠు వ్యాధి పూర్తిగా నయం అవుతుంది. సకాలంలో ఈ వ్యాధి లక్షణాలను గుర్తిస్తే అంగవైకల్యం సంభవించకుండా చూడవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. కుష్ఠు వ్యాధిగ్రస్తులకు రెండు జతల మైక్రో సెల్యులార్‌ రబ్బర్‌ పాదరక్షకులు ఉచితంగా అందిస్తున్నారు. కొందరికీ ఆసరా పింఛన్‌ పథకంలో కూడా అవకాశం కల్పించారు.

రోజురోజుకూ పెరుగుతున్న కేసులు

జిల్లాలో 62 మంది వ్యాధిగ్రస్తులు

ఆందోళన అవసరం లేదు:

డీఎంహెచ్‌ఓ మధుసూదన్‌

అందుబాటులో వైద్యం, మందులు..

వ్యక్తిలో తెల్లని, గోధుమ రంగులో ఎలాంటి స్పర్శలేని మచ్చలు ఉంటే కుష్ఠుగా నిర్ధారించే అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనుమానితులు ఉంటే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు వెళ్తే అక్కడ స్క్రీనింగ్‌ చేసి అవసరమైన వైద్యం అందిస్తారు. వ్యాధిని బట్టి 6 నుంచి 12 నెలల చికిత్స ఉంటుంది. అన్ని రకాల వైద్యసేవలు, మందులు అందుబాటులో ఉన్నాయి.

– డాక్టర్‌ మధుసూదన్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

లెప్రసీ మళ్లొస్తున్నది1
1/1

లెప్రసీ మళ్లొస్తున్నది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement