వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ భవేష్‌మిశ్రా, ఎస్పీ
భూపాలపల్లి: జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. పరీక్షల నిర్వహణపై బుధవారం విద్యాశాఖ సెక్రెటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన, ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పదవ తరగతి పరీక్షలో గతంలో ఉన్న 11 పేపర్లను ప్రస్తుతం ఆరు పేపర్లకు కుదించామని.. దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ భవేష్‌మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో 3,651మంది 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని.. వారికోసం 20పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పోలీస్‌స్టేషన్‌కు ఎనిమిది కిలోమీటర్ల కంటే దూరంలో ఉన్న మూడు పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాల తరలింపు కోసం రెండు రూట్లను గుర్తించామని తెలిపారు. 10వ తరగతి పరీక్షల కోసం 20మంది చీఫ్ సూపరింటెండెంట్, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్, 200మంది ఇన్విజిలేటర్లను నియమించామని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ సురేందర్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్, డీఈఓ రాంకుమార్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీరామ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
వీసీలో మంత్రి సబితాఇంద్రారెడ్డి


