● జిల్లా మత్స్యశాఖ అధికారి రాణాప్రతాప్
స్టేషన్‌ఘన్‌పూర్: మత్స్యకారులు కొరమీను చేపల పెంపకంతో తక్కువ ఖర్చుతో అధిక లాభం పొందవచ్చని జిల్లా మత్స్యశాఖ అధికారి రాణాప్రతాప్ సూచించారు. ఘన్పూర్ రైతువేదికలో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ముర్రెల్ ఫిష్ ఫార్మింగ్(కొరమీను చేపల పెంపకం)పై మత్స్యకార రైతులకు బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్వా కల్చర్ సైంటిస్టు గణేష్ కొరమీను చేపల పెంపకంపై సలహాలు, సూచనలు అందించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా మత్స్యశాఖ అధికారి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన పథకం కింద తెలంగాణ ప్రభుత్వం, మత్స్యశాఖ వారి ఆధ్వర్యంలో కొరమీను చేపల పెంపకంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా చీఫ్ ప్రమోటర్ నీల రాజు, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యూత్ కార్యదర్శి గోరంట్ల యాదగిరి, వివిధ గ్రామాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, మహిళా మత్స్య సొసైటీల సభ్యులు, మత్స్యకారులు పాల్గొన్నారు.


