జనగామ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితా బుధవారం విడుదలైంది. 2026 నవంబర్ 1వ తేదీని అర్హత తేదీగా నిర్ణయించి ఓటర్ల నమోదు, జాబితా రూపకల్పన ప్రక్రియను అధికారులు చేపట్టారు. 2026 నవంబర్ 1వ తేదీ నాటికి కనీసం 3 సంవత్సరాల క్రితం డిగ్రీ పూర్తి చేసిన అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఫారం–18 దరఖాస్తులను ఏఈఆర్‌ఓలకు లేదా నియమిత అధికారికి సమర్పించే అవకాశం కల్పించారు. ఈ నెల 6 వరకు ఫారం–18 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం 20వ తేదీ వరకు ముసాయిదా జాబితా తయారీ, ముద్రణ ప్రక్రియ పూర్తిచేసి, డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురించారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, మార్పులుచేర్పుల కోసం 25వ తేదీ నుంచి వచ్చే నెల డిసెంబర్ 10 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని అదే నెల 25లోగా పరిష్కరించి, సప్లిమెంట్లను సిద్ధం చేస్తారు. ఆ తర్వాత 30న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు.
డ్రాఫ్ట్‌లో 32,908 ఓట్లు
జిల్లాలో 42 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 32,908 మంది ఓటర్లు ఉన్నట్లు డ్రాఫ్ట్ జాబితాలో పేర్కొన్నారు. వీరిలో 20,013 మంది పురుషులు, 12,894 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్ ఓటరు ఉన్నారు. జనగామ డివిజన్‌లో 25 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 20,234 మంది ఓటర్లు (పురుషులు 12,110, మ హిళలు 8,123, థర్డ్ జెండర్ 1) ఉన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్‌లో 17 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 12,674 మంది ఓటర్లు (పురుషులు 7,903, మహిళలు 4, 771, థర్డ్ జెండర్ 0) నమోదయ్యారు.


