అందుబాటులోకి అత్యవసర వైద్యం
ఆధునిక పరికరాలతో మెరుగైన వైద్యం..
జనగామ: జిల్లా కేంద్రంలోని చంపకహిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్) ఆవరణలో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 27న(శుక్రవారం) ప్రారంభించనున్న ఈ భవనం అందుబాటులోకి వస్తే జిల్లా ప్రజ లకు అత్యవసర వైద్యసేవలు మరింత చేరువకానున్నాయి. రూ.23.75కోట్లతో 50 పడకల సామర్థ్యంతో రెండంతస్తుల్లో నిర్మించిన ఈ భవనం ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులకు ఆధునిక చికిత్స అందించే కేంద్రంగా ఉపయోగపడనుంది. 2023లో ప్రారంభమైన నిర్మాణ పనులు 2025 మార్చిలో పూర్తయ్యాయి. 42,691 చదరపు అడుగుల నిర్మాణ వైశాల్యంతో ఈ భవనాన్ని రూపొందించారు.
అత్యాధునిక వైద్య సదుపాయాలు
గ్రౌండ్ ఫ్లోర్‌లో రెండు ఆపరేషన్ థియేటర్లు, రెండు ఐసోలేషన్ గదులు, ఎగ్జామినేషన్ రూమ్, డయాలసిస్ గది, మెటర్నిటీ వార్డు, లేబర్ డెలివరీ రికవరీ (ఎల్‌డీఆర్), అత్యవసర వైద్య విభాగం, సీటీ స్కాన్, ఎక్స్‌రే, అబ్జర్వేషన్, అల్ట్రాసౌండ్ గదులను ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో ఆరు ఐసోలేషన్ వార్డులతో పాటు ఐసీయూ, హెచ్‌డీయూ విభాగాలు అందుబాటులో ఉంటాయి.
ప్రాణాపాయ పరిస్థితుల్లో తక్షణ చికిత్స
రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, శ్వాసకోస సమస్యలు, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సత్వర చికిత్స అందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడనుంది. వెంటిలేటర్లతో శ్వాస అందించడం, మానిటర్ల ద్వారా గుండె స్పందన, రక్తపోటు, ఆక్సిజన్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించడం, అవసరమైన శస్త్ర చికిత్సలు నిర్వహించడం వంటి సేవలకు అవకాశం ఉంటుంది. ఐసోలేషన్ వార్డులు అంటువ్యాధుల నియంత్రణకు దోహదపడనున్నాయి. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, మెడికల్ కాలేజీకి అనుసంధానంగా పనిచేయడం వల్ల వైద్య విభాగాల మధ్య సమన్వయం పెరగనుంది. అత్యవసర రోగులను ఇతర ప్రాంతాలకు తర లించే అవసరం తగ్గి స్థానికంగానే మెరుగైన చికిత్స పొందే అవకాశం కలగనుంది.
50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ సిద్ధం
వైద్య ఆరోగ్య మంత్రి చేతులమీదుగా రేపు ప్రారంభోత్సవం
రూ.154 కోట్లతో వైద్య మౌలిక
వసతుల అభివృద్ధి
రూ.23.75కోట్లతో భవన నిర్మాణం
జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
జిల్లాలో క్రిటికల్ కేర్ బ్లాక్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో వైద్య రంగంలో ఇది కీలక ముందడుగు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు ఆధునిక పరికరాలతో మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఐసీయూ, హెచ్‌డీయూ, వెంటిలేటర్లు, ఆపరేషన్ థియేటర్లు రోగులకు ఎంతో ఉపయోగపడతా యి. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే మా లక్ష్యం. వైద్య సిబ్బంది సమన్వయంతో సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం.
– డాక్టర్ శంకర్, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి


