పాలకుర్తి టౌన్: రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణను కరువు ప్రాంతంగా ప్రకటించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని గూడూరు గ్రామంలో పంట నష్టపోయిన రైతులు బక్క ఎల్లయ్య, బెల్లి వెంకన్న పొలాలను పార్టీ ప్రతినిధుల బృందంతో కలిసి పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని సోమేశ్వర ఫంక్షన్‌హాల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఇప్పటివరకు రైతులకు పరిహారం అందలేదన్నారు. వరి పంటలకు ఎకరానికి రూ.30 వేలు, పత్తి,మొక్కజొన్న తదితర వాణిజ్య పంటలకు రూ. 50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రేషన్ షాపుల ధ్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. కుటుంబ బీమా ఒక్కరికి కాకుండా భార్య, భర్తకు ఇద్దరికి ఇచ్చేలా ప్రభుత్వం సవరణ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, బొట్ల శేఖర్, బూడిద గోపి, చిట్యాల సోమన్న, సుంచు విజేందర్, గంగారపు మహేందర్, బిట్ల గణేష్, మాసంపల్లి నాగయ్య, ఏదునూరి మదార్, ఇంద్రరెడ్డి, సోమ అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ


