జనగామ రూరల్: జిల్లాలో కూరగాయల సాగు ప్రోత్సాహానికి ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేసి మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా కేంద్ర వంటశాలలకు సరఫరా చేసేందుకు జిల్లాలో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈనెల 20వ తేదీ వరకు జిల్లా బృందాలు క్షేత్రస్థాయి పర్యటనలు పూర్తి చేశారు. హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్, అక్షయ పాత్ర ఫౌండేషన్, మన్నా ట్రస్ట్ ఆధ్వర్యంలో కేంద్ర వంటశాలలకు కూరగాయల సరఫరా ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఆరోగ్యకరమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందించడంతో పాటు రైతులకు స్థిరమైన మార్కెట్ కల్పించడం, పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించడం, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పించడం కార్యక్రమం ప్రధాన లక్ష్యం
క్షేత్రస్థాయి పర్యటనలు
జిల్లాలో ఇప్పటికే కూరగాయలు సాగు చేస్తున్న రైతులను గుర్తించడంతో పాటు, సాగునీటి వసతి, మార్కెట్ అనుసంధానం ఉన్న గ్రామాల్లో కొత్తగా కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు జిల్లా స్థాయి బృందం క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జనగామ, రఘునాథపల్లి, బచ్చన్నపేట, లింగాలఘణపురం, చిల్పూరు, జఫర్‌గఢ్, స్టేషన్‌ఘన్‌పూర్, నర్మెట్ట, తరిగొప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో రైతులతో సమావేశాలు పూర్తి కాగా మరో మారు ఈనెల 27, 28 తేదీల్లో గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించనున్నారు.
స్థిరమైన మార్కెట్, మెరుగైన ధరలు
కేంద్ర వంటశాలలకు అవసరమైన కూరగాయలను మహిళా స్వయం సహాయక సంఘాల సేకరణ కేంద్రాల ద్వారా రైతుల నుంచి నేరుగా సేకరించి సరఫరా చేయనున్నారు. మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించి, రైతులకు మెరుగైన ధరలు లభించేలా చర్యలు తీసుకోనున్నారు. రైతులు కూరగాయలు సరఫరా చేసిన 2–3 రోజుల్లోనే సత్వరం చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోనున్నారు.
ప్రభుత్వ పథకాల అనుసంధానం
కూరగాయల సాగుకు ముందుకు వచ్చే ప్రతీ రైతు వివరాలను సేకరించి, వారికి అవసరమైన విత్తనాలు, నారు, డ్రిప్, స్ప్రింక్లర్లు, శాశ్వత పందిళ్లు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు, మల్చింగ్, ప్లాస్టిక్ క్రేట్లు, వర్మీ బెడ్లు, జీవ ఎరువులు, జీవ పురుగుమందులు తదితర అవసరాలను నమోదు చేయనున్నారు. ఎంఐడీహెచ్, ఆర్‌కేవీవై, పీఎండీసీ, ర్యాడ్, పథకాలను ఉద్యానవన శాఖ పథకాలతో అనుసంధానం చేసి, అందుబాటులో ఉన్న సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలను ప్రాధాన్యంతో కల్పించేందుకు చర్యలు తీసుకుంటారు.
మహిళా సంఘాలకు బాధ్యతలు
కూరగాయల సేకరణ, గ్రేడింగ్, సార్టింగ్, రవాణా వంటి పోస్ట్ హార్వెస్ట్ కార్యకలాపాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషించనున్నాయి. కేంద్ర వంటశాలలకు అవసరమైన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కూరగాయలను నిర్వహించేలా మహిళా సంఘాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రైతుల నుంచి సేకరణ కేంద్రాలకు, అక్కడి నుంచి కేంద్ర వంటశాలలకు కూరగాయల రవాణా కోసం వాహనాల మ్యాపింగ్‌ను కూడా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం అమలుకు జిల్లా స్థాయి బృందాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి చైర్మన్‌గా, జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమల శాఖ అధికారి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. అదనపు కలెక్టర్ పర్యవేక్షణలో పనిచేస్తుంది.
ప్రభుత్వ పథకాలతో
అనుసంధానం
రైతులకు స్థిరమైన ఆదాయం,
సత్వర చెల్లింపులు
మహిళా సంఘాల ద్వారా
కేంద్ర వంటశాలలకు సరఫరా
జిల్లాస్థాయి బృందం ఏర్పాటు
కొనసాగుతున్న క్షేత్రస్థాయి పర్యటనలు


