చిల్పూరు: అడవిలో ఉంటూ అనుక్షణం భయపడుతూ ప్రజలకోసం పనిచేయలేమని ప్రజాస్వామ్య పద్ధతిలోనే పనిచేస్తానని ఛత్తీస్‌గఢ్ మాజీ మావోయిస్టు నేత గీరెడ్డి పవనానందరెడ్డి అన్నారు. స్వగ్రామమైన మండలంలోని పల్లగుట్ట గ్రామానికి గురువారం ఆయన చేరుకున్నారు. గ్రామానికి చెందిన దివంగత హెచ్‌ఎం గీరెడ్డి దామోదర్‌రెడ్డికి ముగ్గురు సంతానం. అందులో పవానానందరెడ్డి పల్లగుట్ట, తాటికొండ (స్టేషన్‌ఘన్‌పూర్ మండలం) పాఠశాలల్లో చదివాడు. 1979లో పవన్ మావోయిస్టు జనగామ సెంట్రల్ ఆర్గనైజర్‌గా చేరి సుమారు 40 ఏళ్లు అజ్ఙాత జీవితం గడిపారు. ఆదివాసీలతో పనిచేసి ఛత్తీస్‌గఢ్ దండకారణ్య రాష్ట్ర కమిటీ నాయకుడిగా ఎదిగాడు. కగార్ పరిస్థితుల్లో సాయుధ విప్లవాన్ని వదిలిన పవన్ చిన్నాన్న విశ్రాంత హెచ్‌ఎం గీరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అనారోగ్యంతో ఉండగా పరామర్శించడానికి మొదటిసారి గ్రామానికి చేరుకున్నారు. ఆయనకు చిన్ననాటి మిత్రులు స్వాగతం పలికారు. మిత్రులతో కలిసి తాటికొండ, పల్లగుట్ట పాఠశాలలను సందర్శించి చిన్ననాటి జ్ఙాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలోనే సాధ్యమైనంత మేరకు ప్రజలకు సేవచేస్తానని తెలిపారు. ఆయన వెంట సాదం రాజయ్య, సానాది రాజు, ఉబ్బని భిక్షపతి తదితరులు ఉన్నారు.
మాజీ మావోయిస్టు గీరెడ్డి పవనానందరెడ్డి


