● ఇద్దరికి తీవ్ర గాయాలు
రఘునాథపల్లి: మండల కేంద్రంలోని ఖిలాషాపూర్ రోడ్డుపై వీధి కుక్కలు అడ్డుగా రావడంతో ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఖిలాషాపూర్ నుంచి ఆలేటి రాములు గురువారం తన ఆటోలో ఇద్దరు ప్రయాణికులతో రఘునాథపల్లికి వస్తున్నాడు. రఘునాథపల్లి మండల కేంద్రానికి చేరుకోగానే అకస్మాత్తుగా వీధి కుక్కలు రోడ్డుపైకి రావడంతో వాటిని తప్పించేందుకు డ్రైవర్ రాములు ఒక్కసారిగా ఆటోకు బ్రేక్ వేశాడు. దీంతో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఖిలాషాపూర్ గ్రామానికి చెందిన సునిత, డ్రైవర్ రాములు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆటోను పైకి లేపి గాయపడిన వారిని జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సునితకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
రేపు జిల్లాలో హైకోర్టు
న్యాయమూర్తి నందా పర్యటన
జనగామ రూరల్: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేపల్లి నందా ఆగస్టు ఒకటవ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కోర్టు, స్టేషన్ ఘన్‌పూర్, శివునిపల్లి ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించనున్నట్లు సమాచారం. ఆమెతోపా టు కుటుంబ సభ్యులు కూడా ఈ పర్యటనలో పాల్గొననున్నారు. ఉదయం 8.00 గంటలకు హైదరాబాద్ నుంచి భువనగిరి మీదుగా రోడ్డు మార్గాన బయల్దేరి 10.40 గంటలకు జనగామకు చేరుకుంటారు. అనంతరం ఆర్ అండ్ బీ అతిథి గృహానికి చేరుకుని గౌరవ వందనం స్వీకరిస్తారు. ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల మధ్య జిల్లా కోర్టు సముదాయంలో న్యాయాధికారుల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.25 గంటల నుంచి 12.55 గంటల వరకు జనగామ బార్ అసోసియేషన్ హాల్‌లో న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.45 గంటలకు పసరమడ్ల చంపక్ హిల్స్‌లో నిర్మాణంలో ఉన్న 10+2 కోర్టు భవన సముదాయాన్ని పరిశీలిస్తారు మధ్యాహ్నం 2.20 గంటలకు స్టేషన్ ఘన్‌పూర్ కోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 4.20 గంటల మధ్య జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, స్టేషన్ ఘన్‌పూర్‌లో మండల న్యాయ సేవల సంస్థ ప్రారంభోత్సవంతోపాటు ఈ– సేవ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 4.20 గంటలకు స్టేషన్ ఘన్‌పూర్ కోర్టు భవనా నికి ఎదురుగా ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం సా యంత్రం 4.45 గంటల నుంచి 5.15 గంటల మధ్య శివునిపల్లిలో ప్రతిపాదిత కోర్టు భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలిస్తారు. సాయంత్రం 5.15 గంటలకు శివునిపల్లి నుంచి పాలకుర్తికి బయల్దేరి 5.45 గంటలకు చేరుకుని సోమేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేసుకునే అవకాశం ఉంది. లేదా చిల్పూర్‌కు, వల్మిడి ఆలయంలో దర్శనం చేసుకోనున్నారు.
కేయూ క్యాంపస్: హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గురువారం జరిగిన రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగ సంఘం (టీయూఎన్‌టీఈఏ) సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యవర్గంలో కాకతీయ యూనివర్సిటీ నుంచి ముగ్గురికి ప్రాతినిథ్యం లభించింది. టీయూఎన్‌టీఈఏ వర్కింగ్ ప్రసిడెంట్‌గా వల్లాల తిరుపతి, ఉపాధ్యక్షుడిగా బూర నవీన్, జాయింట్ సెక్రటరీగా తాటి దామోదర్ ఎన్నికయ్యారు.
ముంపునకు గురైన రహదారి
వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి, పెద్దగొళ్లగూడెం గ్రామాల మధ్యన ఇసుక వాగు వద్ద డైవర్షన్ రోడ్డు ఇప్పటికే వర్షంతో కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయా యి. బ్రిడ్జికి రెండు వైపులా అధిక సంఖ్యలో లారీలు, బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. 163వ జాతీయ రహదారిపై ఇసుక వాగు వద్ద రహదారి విస్తరణ పనుల్లో భాగంగా బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. కాగా, వరద ముంపు కారణంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌తోపాటు వాగు అవతలి వైపు ఉన్న 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద కారణంగా ఇసుక వాగు వద్ద డైవర్షన్ రహదారి మునిగిన విషయం తెలియక చాలా మంది అక్కడికి చేరుకుని ఇబ్బందులు పడ్డారు. ఇసుక వాగు వద్ద ఎస్సై సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు పహారా కాస్తున్నారు. కాగా, గోదావరి వరద ఉధృతి తగ్గగానే రహదారి పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని బ్రిడ్జి కాంట్రాక్టర్‌కు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఫోన్‌లో సూచించారు.


