చిగురించిన ఆశలు | - | Sakshi
Sakshi News home page

చిగురించిన ఆశలు

Jul 31 2026 12:39 AM | Updated on Jul 31 2026 12:39 AM

ఖాళీల భర్తీకి పోలీస్‌శాఖ

నోటిఫికేషన్‌

93 పోస్టులు ఖాళీ..

జనగామ: తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) విడుదల చేసిన 7,437 పోస్టుల నోటిఫికేషన్‌తో జిల్లాలోని నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి. కొంతకాలంగా పోలీసు నియామకాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌తో పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. సివిల్‌ కానిస్టేబుల్‌, ఆర్ముడ్‌ రిజర్వ్‌ కానిస్టేబుల్‌, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, ఫైర్‌ ఫైటర్‌, జైలు వార్డర్‌ పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్‌ రావడంతో నిరుద్యోగుల్లో ఉత్సాహం నెలకొంది. జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపులో జనగామ జిల్లా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉన్నందున జిల్లాకు ప్రత్యేకంగా సివిల్‌ కానిస్టేబుల్‌, ఏఆర్‌ కానిస్టేబుల్‌ పోస్టులు ఒక్కటీ లేకున్నా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే నియామక ప్రక్రియలో ఇతర విభాగాల్లో అవకాశం కోసం అభ్యర్థులు పోటీ పడనున్నారు. ఫైర్‌ ఫైటర్‌ విభాగంలో 16 పోస్టులు, పురుష వార్డర్‌ విభాగంలో 2 పోస్టులు జనగామ జిల్లాకు కేటాయించారు.

శిక్షణలో బిజీగా..

జిల్లా కేంద్రంతోపాటు 12 మండలాల పరిధిలో యువత కొన్ని నెలలుగా రోజు వారీ మినీ స్టేడియం, పాఠశాల మైదానాలు, బతుకమ్మకుంట, రహదారులపై పరుగు సాధన చేస్తున్నారు. ఐదు కిలోమీటర్ల పరుగుతోపాటు లాంగ్‌ జంప్‌, హై జంప్‌, షాట్‌పుట్‌ వంటి శారీరక అంశాల్లో శిక్షణ తీసుకుంటూనే రాత పరీక్ష కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మెరుగైన ఫలితాలకోసం కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.

పోటీ తీవ్రంగా ఉండే అవకాశం..

గత నియామకాల మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉందని అంచనా. పోస్టుల భర్తీ సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ పోటీ కూడా అదే స్థాయిలో ఉండనుండడంతో అభ్యర్థులు శారీరక దారుఢ్యంతోపాటు రాత పరీక్షకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ఎంపిక విధానం, శారీరక ప్రమాణాలను పూర్తిగా అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా సిద్ధమైతే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నోటిఫికేషన్‌ విడుదల కావడంతో దరఖాస్తు ప్రక్రియ, పరీక్షల షెడ్యూల్‌, శారీరక పరీక్షల తేదీల కోసం జిల్లాలోని అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

జిల్లాలో పోలీస్టేషన్లవారీగా

కానిస్టేబుళ్ల పోస్టుల ఖాళీలు

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న యువత

శారీరక పరీక్షలు, ఎంట్రెన్స్‌పై

అభ్యర్థుల దృష్టి

జిల్లాలో 93 కానిస్టేబుల్‌ పోస్టుల ఖాళీ

మండలం ఖాళీలు

జనగామ పట్టణం 20

నర్మెట/తరిగొప్పుల 08

కొడకండ్ల 12

జఫర్‌గఢ్‌ 03

లింగాలఘనపురం 11

చిల్పూరు –

దేవరుప్పుల 09

బచ్చన్నపేట 11

స్టేషన్‌ఘన్‌పూర్‌ –

రఘునాథపల్లి 09

పాలకుర్తి 10

జిల్లా పరిధిలోని 12 పోలీస్‌ స్టేషన్లలో ప్రస్తుతం 93 కానిస్టేబుల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి చేపట్టిన కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు కేటాయించే కానిస్టేబుళ్లలో అవసరమైన సంఖ్యను జిల్లాకు కేటాయించి ఈ ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జనగామ జిల్లా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉండటంతో, నియామక ప్రక్రియ పూర్తయిన అనంతరం కమిషనరేట్‌ అవసరాలకు అనుగుణంగా సిబ్బందికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. దీంతో జిల్లాలో చాలాకాలంగా ఖాళీగా ఉన్న కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ అయ్యే అవకాశముందని, పోలీస్‌ స్టేషన్లలో సిబ్బంది కొరత కొంత మేర తీరుతుందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement