జనగామ రూరల్: మండలంలోని శామీర్‌పేట గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ జి.సంధ్యారాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22 నుంచి 24 వరకు ప్రవేశాలు ఉన్నాయని, ఎస్టీ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనాథలకు, బీసీ, బీసీ–ఈ, ఓసీ, పీహెచ్‌సీ, ఎన్‌సీసీ స్పోర్ట్ కోటా కింద ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, లైఫ్‌సైన్స్, ఎంఎల్‌టీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన బాలికలు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. మరిన్ని వివరాల కోసం 8309754381, 7382524420 9963276391, 9347819166 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.
నేటి గ్రీవెన్స్ రద్దు
జనగామ రూరల్: ఈనెల 20వ తేదీన(సోమవారం) జరిగే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం హనుమకొండలో మంత్రుల సమావేశం ఉన్నందున గ్రీవెన్స్‌ను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయం గమనించాలని కలెక్టరేట్‌కు రావొద్దని కోరారు.
బయటవ్యక్తులపై
అప్రమత్తంగా ఉండాలి
జనగామ రూరల్: లాడ్జీలకు వస్తున్న బయట వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. ఆదివారం సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఐ రతీష్, చెన్నకేశవులుతో కలిసి పట్టణంలోని లాడ్జీలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఆస్తినేరాలు, చైన్ స్నాచింగ్ ఘటనల దృష్ట్యా తనిఖీలు చేపట్టామన్నారు. లాడ్జీల నిర్వాహకులు వ్యక్తుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఘనంగా సౌరవృత్త తారావళి పుస్తకావిష్కరణ
హన్మకొండ కల్చరల్: సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వరంగల్ ఆధ్వర్యంలో అజో విభో కంధాళం ఫౌండేషన్ అధ్యక్షుడు అప్పాజోస్యుల సత్యనారాయణ రచించిన సౌర వృత్త తారావళి, వ్యాఖ్య పుస్తకాల ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ మేరకు ఆదివారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని పీఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో సహృదయ సంస్థ అధ్యక్షులు గన్నమరాజు గిరిజామనోహరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీ వేత్త, కవి విహారి, విశిష్ట అతిథులుగా తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి అనుమాండ్ల భూమయ్య, రచయిత, వ్యాఖ్యాత ఆచార్య తాడేపల్లి పతంజలి, సాహితీవేత్త డాక్టర్ దహగం సాంబమూర్తి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర సాహితీ అవార్డు గ్రహిత డాక్టర్ అంపశయ్య నవీన్, కవి రామచంద్రమౌళి, వీఆర్.విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాసరావు, వనం లక్ష్మీకాంతారావు, మల్యాల మనోహరరావు, కళా రాజేశ్వర్, డాక్టర్ టి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
బోడ కాకర @400
జనగామ : మార్కెట్‌లో బోడ కాకరకాయ ధర రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం కిలో బోడ కాకర రూ.400 వరకు పలుకుతుండటంతో వినియోగదారులు కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. వర్షాల ప్రభావంతో దిగుబడి తగ్గడం, మార్కెట్‌కు సరఫరా లేకపోవడం వల్ల ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ధరలు తగ్గాలంటే సరఫరా పెరగాల్సి ఉందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.


