జనగామ: కలెక్టరేట్ నిధుల్లో మరో భారీ ఆర్థిక అక్రమం వెలుగుచూసింది. గతంలో ‘దిక్సూచి’ పుస్తకాల వ్యవహారంలో రూ.46.50 లక్షల ప్రజాధనం దుర్వినియోగం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. ఇప్పుడు కలెక్టరేట్‌లోని ఖాతా నుంచి రూ.37,85,050 అపహరణ జరిగినట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈ వ్యవహారంపై జనగామ పట్టణ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత–2023తో పాటు ఐటీ చట్టం–2000లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి కలెక్టరేట్‌కు చెందిన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసి శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు చేపట్టారు.
నకిలీ బిల్లులతో నిధుల మళ్లింపు
జిల్లా యంత్రాంగం నిర్వహించిన అంతర్గత తనిఖీలు, భౌతిక తనిఖీ, రికార్డుల పరిశీలన కమిటీ ఈ నెల 15న సమర్పించిన నివేదికలో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ట్రెజరీ, పీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థలకు వెలుపల ఒక ప్రైవేట్ బ్యాంకులో నిర్వహిస్తున్న కలెక్టరేట్ ఖాతా నుంచి అసలు సరఫరా జరగని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రి కొనుగోలు చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించి, ఒకే వ్యక్తి నియంత్రణలో ఉన్న వేర్వేరు సంస్థల పేరిట 2026 ఫిబ్రవరిలో ఒకే రోజున మొత్తం రూ.37.85 లక్షలు బదిలీ చేసినట్లు గుర్తించారు. అనంతరం నిర్వహి ంచిన ఆకస్మిక భౌతిక తనిఖీలో చెల్లింపులకు సంబంధించిన ఒక్క వస్తువూ లభించకపోగా, ఎలాంటి కొనుగోలు రికార్డులు కూడా లేనట్లు అధికారులు నిర్ధారించారు.
పరిపాలనా చర్యలు.. దర్యాప్తు ముమ్మరం
ఈ ఘటనపై ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతోపాటు సీసీఏ నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ట్రెజరీ వెలుపల ఉన్న అన్ని ప్రభుత్వ ఖాతాలను మూసివేయడం లేదా ట్రెజరీ విధానంలోకి మార్చడం, బాధ్యతల మార్పు జరిగిన రోజే బ్యాంకు మాండేట్లు రద్దు చేసి కొత్త నమూనా సంతకాలు నమోదు చేయడం, నెలవారీ రీకన్సిలియేషన్ ధ్రువీకరణలను తప్పనిసరి చేయాలని నిర్ణయించారు.
మరిన్ని లావాదేవీలపై విచారణ
ఇది ఒక్కటే ఘటన కాదని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. గతంలో పదో తరగతి విద్యార్థుల కోసం ‘దిక్సూచి’ పుస్తకాల పేరిట రూ.46.50 లక్షలు చెల్లించినప్పటికీ ఒక్క పుస్తకం కూడా జిల్లాకు సరఫరా కాలేదని గుర్తించి, ఆ వ్యవహారాన్ని ఇప్పటికే సంబంధిత దర్యాప్తు సంస్థకు అప్పగించారు. అదే ఖాతాలపై లోతైన పరిశీలనలో మరిన్ని అనుమానాస్పద చెల్లింపులు కూడా బయటపడినట్లు వెల్లడించారు. మొత్తంగా కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం బహుళ సంస్థల దర్యాప్తు పరిధిలో ఉందని పేర్కొన్నారు. దర్యాప్తు ప్ర యోజనాల దృష్ట్యా నిందితుల పేర్లు, ఇతర సాక్ష్యాధారాలను ప్రస్తుతం వెల్లడించడం లేదని, వ ్యక్తిగత బాధ్యత న్యాయ విచారణలో తేలుతుందని అధికారులు తెలిపారు. అలాగే ప్రజాధనంలో ప్రతి పైసా తిరిగి రాబట్టి, బాధ్యులు ఎవరైనా, ఏ స్థాయిలో ఉన్నా చట్టంముందు జవాబుదారీ కాక తప్పదని, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.
కలెక్టరేట్‌లో రూ.37.85లక్షల అక్రమం
ఫర్నిచర్, కంప్యూటర్ల పేరిట డ్రా
కేసు నమోదు..ముగ్గురు కలెక్టరేట్ ఉద్యోగుల సస్పెన్షన్
దుర్వినియోగంపై కొనసాగుతున్న విచారణ
బాధ్యులపై చట్టప్రకారం చర్యలు: జిల్లా యంత్రాంతం


