మంత్రి కార్యక్రమం వాయిదా | - | Sakshi
Sakshi News home page

మంత్రి కార్యక్రమం వాయిదా

Jan 24 2026 7:23 AM | Updated on Jan 24 2026 7:23 AM

మంత్ర

మంత్రి కార్యక్రమం వాయిదా

బచ్చన్నపేట: మండల కేంద్రంలో కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల నూతన భవన ప్రారంభ కార్యక్రమం వాయిదా పడినట్లు ఎంపీడీఓ మమతాబాయ్‌ తెలిపారు. రూ.2.30 కోట్లతో నిర్మించిన కేజీబీవీ పాఠశాల ప్రారంభోత్సవానికి శుక్రవారం మంత్రి సీతక్క రావాల్సి ఉండగా..వాయిదా వేసినట్లు చెప్పారు. కాగా, సాయంత్రం వరకు నాయకులు, అధికారులు వేచి ఉండగా వాయిదా పడడంతో వెనుదిరిగారు.

రాజ్యాంగాన్ని రక్షించాలి

జనగామ రూరల్‌: దేశంలో మతోన్మాదాన్ని తిప్పికొట్టి రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని మాజీ పార్లమెంట్‌ సభ్యురాలు సుభాషిణి అలీ అన్నారు. శుక్రవారం పట్టణంలో గిన్నిగడ్డలో ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి ఎండీ అజారుద్దీన్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముస్లిమ్‌ సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా సుభాషిణి మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర పోరాటంలో హిందువులు ముస్లింలు కలిసి ఐక్యంగా బ్రిటీష్‌ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉందన్నారు. ముస్లిం సమరయోధుల పోరాట చరిత్రను ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ వక్రీకరించి ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంఏ గయాస్‌, అబ్దుల్‌ సమద్‌, ఎండి షబానా, ఇర్రి అహల్య, జోగు ప్రకాష్‌, ఎండీ దస్తగీర్‌, బొట్ల శేఖర్‌, బోడ నరేందర్‌, సుమ తదితరులు పాల్గొన్నారు

బెల్ట్‌షాపు

రూ.8.50 లక్షలు!

రఘునాథపల్లి: గ్రామంలో బెల్ట్‌షాపు ఏర్పాటుకు నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. మండలంలోని ఫతేషాపూర్‌లో బెల్ట్‌షాపు, చికెన్‌ దుకాణం ఏర్పాటు కోసం శుక్రవారం ఏకంగా గ్రామ పంచాయతీ వద్దే వేలం నిర్వహించారు. బెల్ట్‌షాపు కోసం నిర్వహించిన వేలంలో 14 మంది పాల్గొన్నారు. రూ 8.50 లక్షలు చెల్లించేందుకు ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. చికెన్‌షాపు ఏర్పాటు వేలం రూ.1.50 లక్షలు పలికింది. ఈ మొత్తం రూ.10 లక్షల డబ్బులను పంచాయతీ ఆధ్వర్యంలో మార్చిలో దుర్గమ్మ పండుగ వేడుకలకు, గ్రామాభివృద్ధికి వినియోగించాలని గ్రామపెద్దలు నిర్ణయించారు. ఇదిలా ఉంటే బెల్ట్‌షాపు ఏర్పాటుపై స్థానిక మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ భర్తలు, పిల్లలు మద్యానికి బానిసలవుతున్నారని వాపోతున్నారు. పక్కనున్న ఇబ్రహీంపూర్‌ గ్రామంలో ఏడేళ్లుగా సంపూర్ణ మద్యపాన నిషేదం అమలవుతోంది. అక్కడ బెల్ట్‌షాపులు ఏర్పాటు చేయొద్దని ఊరుమ్మడి నిర్ణయంతో పక్కాగా అమలవుతోంది. అక్కడ పండుగలు చేస్తలేరా..? అభివృద్ధి జరుగడం లేదా..? అని వాపోతున్నారు.

మోడల్‌ స్కూల్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జఫర్‌గఢ్‌: మోడల్‌ స్కూల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైనట్లు మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్రీకాంత్‌ తెలిపారు. మండల కేంద్రంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. మోడల్‌ స్కూల్‌లో 6వ తరగతిలో 100 సీట్లతో పాటు 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలిపోయిన సీట్లకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 19న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 7 నుంచి 10వ తరగతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుందన్నారు. హాల్‌ టికెట్లను ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులకు రూ.125, ఓసీ విద్యార్థులకు రూ.200 ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జాతరను సక్సెస్‌ చేద్దాం

వరంగల్‌ క్రైం: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను పోలీస్‌, ఆర్టీసీ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి సక్సెస్‌ చేద్దామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు. ఈమేరకు సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ పోలీస్‌, ఆర్టీసీ అధికారులతో శుక్రవారం కమిషనరేట్‌లో సమన్వయ సమావేశం నిర్వహించారు. గత జాతరలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తిన ప్రాంతాలు, కారణాలతో పాటు, పోలీస్‌, ఆర్టీసీ సంయుక్తంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా మేడారం జాతరకు చేసిన ఏర్పాట్లపై ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ విజయ భాను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. భక్తుల రద్దీని గమనిస్తూ ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

మంత్రి కార్యక్రమం వాయిదా1
1/1

మంత్రి కార్యక్రమం వాయిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement