గెలిచే బలముంటేనే పోటీ!
జనగామ: పురపాలిక ఎన్నికల్లో క్యాడర్, ప్రజాబలం లేకుండా పోటీచేస్తే ఓటమి తప్పదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గెలిచే బలం ఉందా, ప్రజలు నమ్ముతారా, క్యాడర్ మన వెంట ఉన్నారా ఇవన్నీ చెక్ చేసుకుని పోటీలో నిలువాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాలన్నారు. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో జనగామ మండలం శామీర్‌పేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన పట్టణ వార్డుల కార్యకర్తల సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.. స్థానికంగా ఎమ్మెల్యే లేకపోయినా, ఇటీవల సర్పంచ్ ఎన్నికల విజయోత్సాహం మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. మున్సిపాలిటీలోని 30 వార్డులను గెలవడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రతీ నాయకుడు ప్రజల్లో ఉంటూనే, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఓడిపోయే అవకాశమున్నవారు పోటీ కోసం ఎవరిపై ఒత్తిడి చేయొద్దని,పార్టీకి నష్టం జరగకుండా చూడాలని సూచించారు. జనగామ మునిసిపల్ 30 వార్డుల్లో గెలుపే లక్ష్యంగా ఇన్‌చార్జ్‌లను నియమించాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, కంచె రాములు, నిమ్మతి మహేందర్‌రెడ్డి, బడికె ఇందిర, వంగాల కళ్యాణిమల్లారెడ్డి, జంగి విద్యానాథ్, మాసపేట రవీందర్‌రెడ్డి, డాక్టర్ రాజమౌళి, పజ్జూరి జయహరి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల ప్రారంభం
జనగామ పట్టణంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క శుక్రవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపనలు చేశారు. జనగామ బైపాస్ రోడ్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుల విగ్రహాలు, ఆర్టీసీ బస్టాండ్ చౌరస్తాలో సూర్య నమస్కారాల శిల్పాలు, బతుకమ్మకుంటలో చిల్ట్రన్ పార్కు, జిమ్, కుంట మరమ్మతు పునరుద్ధరణ అభివృద్ధి పనులు, ఆర్‌అం డ్‌బీ బంగ్లా, మోడల్ మార్కెట్‌లను ప్రారంభించగా, నెహ్రూపార్కు 60 ఫీట్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు లకావత్‌త్ ధన్వంతి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, ఆర్డీఓ గోపిరాం, జెడ్పీ సీఈఓ మాధు రి షా, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
వనితా టీ, స్నాక్స్ స్టాల్స్..
బతుకమ్మకుంటలో ఏర్పాటు చేసిన వనితా టీస్టాల్స్‌ను కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పార్క్‌కు వచ్చే ప్రజలకు, చిన్నారులకు రుచికరమైన టీని, పౌష్టికాహారపు చిరుతిళ్లను అందించాలన్నారు.
క్యాడర్, పబ్లిక్‌లో లేకుండా పోటీచేస్తే ఓటమి తప్పదు
టికెట్ కోసం ఒత్తిడి చేయొద్దు
జనగామ 30 వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగుర వేయాలి
పార్టీ సమావేశంలో మంత్రి సీతక్క
గెలిచే బలముంటేనే పోటీ!


