దుమ్ము రోడ్డుకు స్వస్తి!
బచ్చన్నపేట రోడ్డుపై కదిలిన యంత్రాంగం
వారంలో శుభవార్త..
జనగామ: బచ్చన్నపేట మండల కేంద్ర పరిధిలోని సుమారు మూడు కిలోమీటర్ల బీటీ నిర్మాణంలో కదలిక వచ్చింది. ‘దుమ్ముతో జీవనం–గుంతల్లో ప్రయాణం’, ‘బిజినెస్‌లు డౌన్’ శీర్షికన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వరుస కథనాలకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో పాటు నేషనల్ హైవే అథారిటీ ఉన్నతాధికారులు స్పందించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన రోడ్డు సేఫ్టీ సమీక్షలో కలెక్టర్ బచ్చన్నపేట దుమ్మురోడ్డుపై ఎన్‌హెచ్ అధికారులను అడిగారు. రోడ్డు నిర్మాణ పనులు త్వరతగతిన పూర్తిచేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని సూచించారు.
ఆ నిబంధనే అడ్డు..
కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఎక్కడైనా బైపాస్ పనులు పూర్తి చేసిన తర్వాతనే, ఆర్‌అండ్‌బీ పరిధిలోని స్టేట్ రోడ్డును పూర్తి చేయాలనే అగ్రిమెంటు ఉంటుంది. బచ్చన్నపేట బైపాస్ రోడ్డు నిర్మాణంలో పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లడంతో ఏళ్ల తరబడి ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. పోలీస్టేషన్ నుంచి కొడవటూరు కమాన్ సమీపం వరకు సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు జరగాల్సి ఉంది. దీంతో రోడ్డంతా గుంతల మయంగా మారి, కంకర, మట్టిగా మారిపోయింది. విజయవాడ–సిద్దిపేట ప్రధాన రహదారి కావడంతో వాహనాల రద్దీ ఎక్కువే. దీంతో సెకను గ్యాప్ లేకుండా పైకి లేస్తున్న దుమ్ముతో పట్టణం కాస్తా దమ్ముకు నిలయంగా మారిపోయింది. వ్యాపారులు, అన్ని వర్గాలు, ఆయా గ్రామాల నుంచి వచ్చే వ్యాపారులు, ప్రజలు, ప్రయాణికులు దుమ్ముతో వేగలేక చౌరస్తాలో నిలబడలేక అనేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు పడుతున్న కష్టాలను సాక్షి అక్షర రూపంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి బైపాస్ నిర్మాణాలు జరగకుండా, స్టేట్ హైవేలను పూర్తి చేయవద్దనే నిబంధనతో బచ్చన్నపేట బీటీ రోడ్డు ఆగిపోయింది. సాక్షి వరుస కథనాలతో ప్రజలు పడుతున్న కష్టాలను ఎన్‌హెచ్‌ఎస్‌ఈ జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ శాఖ (ఎంఓఆర్‌టీహెచ్) దృష్టికి తీసుకెళ్లారు. అయితే వచ్చే నెల 17వ తేదీన బైపాస్ నిర్మాణంపై కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో ఎన్‌హెచ్ అధికారులు సైతం వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అ యితే దుమ్ముతో వందలు, వేలాది మంది ప్రాణాలకు ముప్పు ఉండడంతో ఎన్‌హెచ్ అధికారుల కోరిక మేరకు సంబంధిత కేంద్ర ప్రభుత్వం శాఖ కూడా పాజిటివ్‌గా స్పందించినట్లు సమాచారం.
ఎన్‌హెచ్ అధికారులతో మాట్లాడిన
కలెక్టర్
ఎంఓఆర్‌టీహెచ్‌తో మాట్లాడిన ఎస్‌ఈ
వారంలో మండల కేంద్ర వాసులకు శుభవార్త
బైపాస్ నిర్మాణ నిబంధనలను సైతం పక్కన బెట్టి, ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని వారం రోజుల్లో పట్టణ పరిధిలోని రోడ్డు నిర్మాణం కోసం శుభవార్త వినిపిస్తారనే సమాచారం తెలిసింది. వారంలోపు బీటీ రోడ్డు నిర్మాణం కోసం జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ శాఖ నుంచి ఎలాగైనా అప్రూవల్ తీసుకు వచ్చేందుకు ఎన్‌హెచ్ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బైపాస్ నిర్మాణం కోర్టు పరిధిలో ఉండడంతోనే బచ్చన్నపేట పట్టణంలో బీటీ రోడ్డు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై తమ ఉన్నతాధికారులు కేంద్రంతో మాట్లాడగా, కలెక్టర్ సైతం ప్రత్యేక చొరవ చూపిస్తున్నారన్నా రు. వారం రోజుల్లో సానుకూల వార్త వస్తుందన్నారు.
దుమ్ము రోడ్డుకు స్వస్తి!
దుమ్ము రోడ్డుకు స్వస్తి!


