పోరు ప్రతిష్టాత్మకం! | - | Sakshi
Sakshi News home page

పోరు ప్రతిష్టాత్మకం!

Jan 21 2026 7:05 AM | Updated on Jan 21 2026 7:05 AM

పోరు

పోరు ప్రతిష్టాత్మకం!

జనగామ: జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల సందడి రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో జనగామలో బీఆర్‌ఎస్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌లో కాంగ్రెస్‌ అత్యధిక సర్పంచ్‌ స్థానాలు గెలుచుకోగా, పాలకుర్తిలో రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ ఎన్నికల వేడి ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల వేదికపై మరింత రగులుతోంది. జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ పురపాలికలను దక్కించుకోవాలని బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తుండగా, అదే పట్టుదలతో కాంగ్రెస్‌ సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఇదిలా ఉంటే బీజేపీ కూడా తన వర్గీకరణ బలోపేతంపై దృష్టి సారించి రోజువారీ సమావేశాలతో వ్యూహాలను ఖరారు చేస్తోంది. ప్రజాబలం ఉన్న అభ్యర్థులను గుర్తించేందుకు మూడు పార్టీలు కూడా వార్డు స్థాయిలో విస్తృత కసరత్తు ప్రారంభించాయి. ఆశావహుల నుంచి అప్లికేషన్లు స్వీకరించి, వార్డుల వారీగా బేరీజు వేసుకుంటూ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నవారినే ఫైనల్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. అయితే ఒక్కో వార్డులో ఇద్దరు లేదా ముగ్గురు ఆసక్తి చూపడం పార్టీలను కొంత ఇబ్బందుల్లో పడేస్తోంది. ఓట్లు చీలకుండా వారిని బుజ్జగించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చర్చలు జరుపుతూ.. టికెట్‌ ఇవ్వని వారికి ఎలక్షన్‌ పనులు అప్పగించే పద్ధతిని అనుసరిస్తున్నారు. అయినా కొన్ని వార్డుల్లో రెబల్‌ సమస్య తప్పదన్న భావనతో ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు సమీక్షలు, రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీతో పొత్తు కుదుర్చుకునే ప్రయత్నం చేస్తుండటం ఎన్నికలను మరింత హోరాహోరీగా మార్చే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

చైర్మన్‌ రేసులో ప్రముఖులు

చైర్మన్‌ రేస్‌పై రాజకీయ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది. జనగామ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ నుంచి స్థానిక నేతలతో పాటు కొన్ని ప్రముఖ పేర్లు వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌లో కూడా ఇద్దరు ప్రధాన నేతలు ముందు వరుసలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో సైతం చైర్మన్‌ పదవిపై రెండు పార్టీలు ఆచితూచి అడుగులు వేయనున్నాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లో ప్రస్తుతం చైర్మన్‌ పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ, పోలింగ్‌ పూర్తయ్యేవరకు గోప్యంగా ఉంచాలని ఆలోచన చేసినట్లు సమాచారం. రెండు మున్సిపాలిటీల్లో వైస్‌ చైర్మన్‌ స్థానంపై ఇతర వర్గాలు దృష్టిసారించాయి. రిజర్వేషన్ల ప్రభావంతో కొన్ని వార్డుల్లో ఆశావహులకు సంబంధించి ఇంకా పోటీపై స్పష్టతకు రాలేక సందిగ్ధంలో ఉన్నారు. ప్రధాన పార్టీలు అనధికారికంగా కొందరికి అభ్యర్థిత్వాన్ని సూచించడంతో వారు ఇప్పటికే ఇంటింటా ప్రచారం మొదలుపెట్టారు. మరోవైపు అధిష్టానం తమవైపే ఉందని, టికెట్‌ తమదేనంటూ మరో గ్రూప్‌ కూడా ప్రచారం చేస్తుండటంతో నోటిఫికేషన్‌, షెడ్యూల్‌ విడుదల కాకముందే కొన్ని వార్డుల్లో ఎలక్షన్‌ హీట్‌ పీక్‌ స్థాయికి చేరేలా చేస్తోంది. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ రెండు చోట్ల అన్ని పార్టీలు బలమైన వ్యూహాలతో హోరాహోరీగా బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుని. నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నాయి.

బీసీ జనరల్‌కు జనగామ మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్‌

వైస్‌ చైర్మన్‌పై ఇతర వర్గాల గురి

చైర్మన్‌ రేసులో ప్రముఖుల పేర్లు..

రెబల్స్‌కు బుజ్జగింపు..

వినకుంటే ఓట్లు చీలకుండా ప్లాన్‌

స్టేషన్‌లోనూ అనధికారికంగా

గ్రీన్‌సిగ్నల్‌.. ప్రచారంలోకి అభ్యర్థులు

బడ్జెట్‌పై అంచనా..

మున్సిపల్‌ బరిలో పోటీ చేస్తే బడ్జెట్‌ ఎంత అనే దానిపై అభ్యర్థులు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. గతంలో పోటీ చేసిన అభ్యర్థులు సొంతంగా నిధుల ఖర్చుపై ఓ అంచనాకు వస్తుండగా, కొత్తగా ఎలక్షన్లకు వచ్చేవారు మాత్రం అనుభవం ఉన్న నాయకులను సంప్రదిస్తూ వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఇటీవల ముగిసిన సర్పంచ్‌ ఎన్నికల్లో చిన్ని పంచాయతీ నుంచి మేజర్‌ వరకు ఎంత ఖర్చు చేశారనే దానిపై ఇన్‌పుట్స్‌ తీసుకుంటూ.. వార్డుల్లో ఓటుకు ఎంత.. రోజువారి ఖర్చులు ఏమేరకు అవుతా యనే దానిపై నిధుల సమీకరణలో బరిలో నిలిచే అభ్యర్థులు ఉన్నారు. డబ్బులను ముందుగానే వార్డుల పరిధిలోని మూడు, నాలుగు చోట్ల భద్రపరిచి, ఎన్నికల కమిషన్‌ కంటబడకుండా అక్కడ నుంచి పంపకాలు చేసేలా ప్లాన్‌ చేసుకుంటున్నారని సమాచారం. పలు వార్డులు మినహాయిస్తే కొన్ని వార్డుల్లో రూ.20 లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఖర్చు కావొచ్చని అంచనా వేస్తున్నట్లు సమాచారం.

పోరు ప్రతిష్టాత్మకం!1
1/1

పోరు ప్రతిష్టాత్మకం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement