బిజినెస్‌లు డౌన్!
● బచ్చన్నపేటలో ఊపిరి సలపనివ్వని దుమ్ము!
● అవస్థలు పడుతున్న ప్రయాణికులు, దుకాణాదారులు
బచ్చన్నపేట: మండల కేంద్రంలో పాత బస్టాండ్ నుంచి పోలీస్‌స్టేషన్ వరకు రోడ్డుపై వాహనాలు వెళ్లినప్పుడు విపరీతమైన దుమ్ము లేచి ప్రయాణికులు, చుట్టుపక్కల దుకాణదారులు అవస్థలు పడుతున్నారు. ప్రధాన చౌరస్తా గుండా చేర్యాల, ఆలేరు, జనగామ మూడు పట్టణాలకు వెళ్లేదారులు ఉన్నాయి. ప్రతి నిత్యం ఈ చౌరస్తా గుండా వందల వాహనాలు పలు పట్టణాలకు వెళ్తుంటాయి. అలాగే పలువురు ప్రయాణికులు కూడా పాత బస్టాండ్ నుంచి గ్రామపంచాయతీ వరకు కాలినడకన వెళ్తుంటారు. ఇక్కడ లేచిన దుమ్ము వారి కళ్లలో పడుతున్నది. అలాగే పక్కనే ఉన్న పలు హోటళ్ల వద్దకు కూడా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తుంటారు. అలాగే నిత్యం రోడ్డు పక్కన పెట్టి అమ్ముకునే తినుబండారాల దుకాణాలు, హోటల్‌లలో తయారు చేసి నిలువ ఉంచే తినుబండారాలపై, ఆహారపదార్థాలపై దుమ్ము చేరి అవి తిన్న పలువురి ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది. అలాగే పండ్లు, మొక్కజొన్న కంకులను అమ్ముకునే వారు కూడా రోడ్డు పక్కనే తోపుడు బళ్లను పెట్టుకుంటారు. పలువురు తరుచూ ఆసుపత్రులకు వెళ్లి వేలలో డబ్బులను వైద్యానికి ఖర్చు చేస్తున్నారు. పలు ప్రాంతాలకు వెళ్లే వారు బస్సుల కోసం ఇక్కడ వేచిఉంటారు. వారు కూడా దుమ్ముతో అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపైకి దుమ్ము రాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని మండల, గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి
చౌరస్తా దగ్గర షాపులో ప్రతీ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటూ అందులోనే నివాసముంటున్నాం. విపరీతమైన దుమ్ముతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. షాపులో ఏమైనా ఆహార పదార్థాలను తినాలన్నా తినలేకపోతున్నాం. తినే సమయంలో మరొకరిని షాపులో ఉంచాల్సి వస్తున్నది. దుమ్ము భయంతో మా షాపులకు వినియోగదారులు కూడా సరిగా రావడం లేదు.
–దొంతుల అజయ్‌కుమార్,
ఎలక్ట్రికల్ షాపు, బచ్చన్నపేట
దుకాణంలో ఉండలేకపోతున్నాం
చౌరస్తా వద్ద ఉన్న దుకాణాలకు విపరీతమైన దుమ్ము వస్తుండడంతో మాస్కు లేకుండా ఉండలేకపోతున్నాం. పొద్దంతా మాస్క్‌లను వినియోగిస్తే తొందరగా అలసిపోతున్నాం. దుకాణాల్లో ఉన్న నూతన వస్తువులపై దుమ్ము చేరి అవి పాతవిగా అగుపిస్తున్నాయి. ప్రతి రోజు వాటిని శుభ్రం చేయడానికి చాలా సమయం అవుతున్నది.
–గడ్డమీది రామాంజనేయులు, బచ్చన్నపేట
హోటల్‌లోకి గిరాకీ రావడం లేదు
చౌరస్తా పక్కనే ఉన్న మా హోటల్లోకి విపరీతమైన దుమ్ము చేరడంతో తినుబండారాలను, టిఫిన్ చేయడానికి వినియోగదారులు రావడం లేదు. దీంతో అడ్డా కిరాయి మీద పడుతున్నది. ఒక్కో రోజు తయారు చేసిన టిఫిన్లు అమ్ముడపోక నష్టం వాటిల్లుతోంది. భారీ వాహనాలు వచ్చినప్పుడు దమ్ము సలుపనీయకుండా దుమ్ము వస్తున్నది. దీనితో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నాం.
–నర్సింహ, హోటల్, బచ్చన్నపేట
బంద్‌కు పిలుపునిస్తాం
రోడ్డు మరమ్మతు విషయంలో అధికారులు, నాయకులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అఖిలపక్ష పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో బచ్చన్నపేట బంద్‌కు పిలుపునిస్తాం. ఈ గుంతల రోడ్డుపై రోజుకో ప్రమాదం జరుగుతున్నా ఎవ్వరికి చీమకుట్టినట్లు కూడా అవడం లేదు.
–ఇర్రి రమణారెడ్డి,
రైతుబంధు సమితి జిల్లా మాజీ కోఆర్డినేటర్
బిజినెస్‌లు డౌన్!
బిజినెస్‌లు డౌన్!
బిజినెస్‌లు డౌన్!
బిజినెస్‌లు డౌన్!
బిజినెస్‌లు డౌన్!
బిజినెస్‌లు డౌన్!


