పల్లెపాలనపై పట్టుసాధించాలి
● పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి శాఖ కమిషనర్ శ్రుతిఓజా
● నూతన సర్పంచ్‌లకు ఐదు రోజుల
శిక్షణ కార్యక్రమం
జనగామ రూరల్: గ్రామ అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రుతి ఓజా అన్నారు. నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లకు గ్రామ పంచాయతీ పాలన, విధులు, అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై ఐదు రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, జెడ్పీ సీఈఓ మాధురి, ఇన్‌చార్జ్ డీపీఓ వసంతతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మొదటి విడతలో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల సర్పంచ్‌లు హాజరయ్యారు. ఈసందర్భంగా కమిషనర్ శ్రుతి ఓజా మాట్లాడుతూ.. గ్రామాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలంటే సర్పంచ్‌లు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. పంచాయతీరాజ్‌చట్టంలో సర్పంచ్ లకు పొందుపరిచిన అధికారాలు, విధులు తదితర అంశాలను శిక్షణలో భాగంగా క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సర్పంచ్‌లది ప్రధాన పాత్ర ఉందన్నారు. శిక్షణ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ట్రైనర్స్, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
స్టేషన్‌ఘన్‌పూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలు అవగాహన కల్గి ఉండాలని, పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రుతి ఓజా సూచించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి కమిషనర్ మండలంలోని రంగరాయగూడెం, మీదికొండ గ్రామాల్లో సోమవారం పర్యటించారు. రంగరాయగూడెం గ్రామంలో పీఎంకేఎస్‌వై పథకం కింద నిర్మించిన చెక్‌డ్యామ్‌లను పరిశీలించారు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణం నాణ్యతతో చేశారా అని తనిఖీ చేశారు. అనంతరం మీదికొండ గ్రామంలో పీఎంకేఎస్‌వై పథకం లబ్ధిదారులతో సమావేశమయ్యారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు అందించే పౌష్టికాహారాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ వసంత, అసిస్టెంట్ డీఆర్‌డీఓ చంద్రశేఖర్, డీఎల్‌పీఓ వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ నర్సింగరావు, ఏపీఎం ప్రేమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కూలీల వేతనాలపై ఆరా
రఘునాథపల్లి: మండలంలోని నిడిగొండలో కొనసాగుతున్న జాతీయ ఉపాధి పనులను పంచాయతీ రాజ్ కమిషనర్ శ్రుతి ఓజా, కలెక్టర్ రిజ్వాన్‌బాషా పరిశీలించారు. మట్టి పనులను పరిశీలించి కూలీలతో నేరుగా మాట్లాడారు. దినసరి వేతనం రూ.307 కూలీ అందుతుందా? పనుల వద్ద ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.


