వడ్డీలేని రుణాల పరిమితి పెంచాలి
● మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ: మహిళల ఆర్థిక అభివృద్ధిని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అమలుచేస్తున్న వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.20 లక్షల వరకు పెంచాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో 354 స్వయం సహాయక సంఘాలకు రూ.1,03,67,691ల వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రుణాలు తీసుకుని ఆర్థిక బలోపేతమవుతూ, తిరిగి చెల్లించడంలో మనమే ముందువరుసలో ఉన్నామన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్క మహిళతో పాటు దివ్యాంగులు కూడా మహిళా సంఘంలో సభ్యత్వం తీసుకునేందుకు ప్రభుత్వం సవరణ చేసిందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరాం, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, మెప్మా పీడీ హర్షవర్ధన్, పట్టణ స్వయం సహాయక సభ్యులు పాల్గొన్నారు.


