బరిలోకి సతులు
వార్డుల వారీగా స్వతంత్రులపై గురి
జనగామ: రిజర్వేషన్లు కలిసిరాక పతుల స్థానంలో సతులు బరిలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పక్కవార్డులో పోటీ చేస్తే పార్టీలో అంతర్గత వ్యతిరేకత పెరుగుతుందనే సందేహం ఆశావహుల్లో కనిపిస్తోంది. ప్రజాదరణ ఉన్న నాయకులకు పార్టీల టికెట్లు ఇవ్వాలన్న ఆలోచన కొనసాగుతోంది. సీపీఎం, సీపీఐ మద్దతు ఎవరికన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రధాన పార్టీలు ఇంటెలిజెన్స్ సర్వేలతో విజేతలను అంచనా వేస్తుండగా, బీజేపీ ఎక్కువ వార్డుల్లో పోటీకి సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గరపడుతుండగా, జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ పురపాలికలో వార్డు రిజర్వేషన్ల మార్పులు ఆశావహుల రాజకీయ లెక్కలను తారుమారు చేశాయి. కొందరు నాయకులు తమ సొంత వార్డులో పోటీ చేయాలని భావించినా, రిజర్వేషన్ల మార్పుల కారణంగా ఓటు వేయాల్సిన వార్డే మారిపోవడం వారు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యగా మారింది. ఫలితంగా, తమకే ఓటు వేయలేని పరిస్థితి ఏర్పడడంతో ఆశావహుల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.
గెలుపు గుర్రాల కోసం ఇంటెలిజెన్స్ సర్వే
రాజకీయంగా బలమైన పక్కవార్డుల్లో పోటీకి దిగితే సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందనే భావన ఆశావహులను మరింత సందిగ్ధంలోకి నెడుతోంది. మరోవైపు, మహిళా రిజర్వేషన్లు పెరగడంతో అనేక మంది నాయకులు తమ స్థానంలో భార్యలను బరిలోకి దించే ప్రయత్నాలు ప్రారంభించారు. కొన్ని వార్డుల్లో వ్యూహరచనలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీతో పాటు సీపీఎం, సీపీఐ కూడా అంతర్గతంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశాయి. పార్టీల అధిష్టానాలు ఆశావహుల పేర్లను సేకరించడమే కాకుండా, సైలెంట్‌గా గెలిచే అవకాశాలపై సొంతంగా ఇంటెలిజెన్స్ సర్వేలు కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో పురపాలికలపై జెండా ఎగురవేయాలనే పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. జనవరి 20న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఫిబ్రవరి 12న పోలింగ్ జరుగుతుందన్న అంచనాలతో పార్టీలు ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసే దిశగా కదులుతున్నాయి.
పార్టీలకతీతంగా ఆయా వార్డుల్లో ప్రజాదరణ ఉన్న స్వతంత్రులను కూడా పరిగణనలోకి తీసుకుంటూ టికెట్లు ఇవ్వాలన్న ఆలోచన కొన్ని పార్టీల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా జనగామ, స్టేషన్ ఘన్‌పూర్‌లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వ్యూహరచన చేస్తున్నాయి. మరోవైపు, బీజేపీ జనగామలో అన్ని వార్డుల్లో పోటీ చేయాలని యోచిస్తున్నప్పటికీ, స్టేషన్ ఘన్‌పూర్‌లో మాత్రం గెలుపు అవకాశాలు ఉన్న వార్డులను మాత్రమే ఎంచుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీపీఎం, సీపీఐలు ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారన్న విషయం తెలియాల్సి ఉంది. స్వతంత్రంగా పోటీ చేయాలా, లేక బలమైన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలా అనే అంశంపై ఆ పార్టీల్లో చర్చలు సాగుతున్నట్లు సమాచారం. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ల మార్పులు స్థానిక రాజకీయాలను కుదిపేసిన ఈ నేపథ్యంలో, పార్టీల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, స్వతంత్రుల ప్రభావం ఇవన్నీ కలిసి మున్సిపల్ ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి.
రిజర్వేషన్లు కలిసిరాని వార్డుల్లో పోటీకి సిద్ధం
పక్కవార్డులో పోటీచేస్తే అంతర్గత వ్యతిరేకత తప్పదా
ప్రజాదరణ ఉన్న నాయకులకే పార్టీల టికెట్..?
సీపీఎం, సీపీఐ మద్దతు ఎవరికి...!
ప్రధాన పార్టీల ఇంటెలిజెన్స్ సర్వే


