సీఎం కప్ క్రీడాపోటీలు షురూ
● క్రీడలకు పకడ్బందీ ఏర్పాట్లు
● పంచాయతీ నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు
● 727 మంది క్రీడాకారుల రిజస్ట్రేషన్
జనగామ రూరల్: రాష్ట్రంలో క్రీడాస్ఫూర్తిని పతాక స్థాయిలో నిలిపేలా, క్రీడా వాతావరణాన్ని సృష్టించడానికి శనివారం నుంచి చీఫ్ మినిస్టర్ కప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ మహా క్రీడలను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం, క్రీడాశాఖల ఆధ్వర్యంలో ప్రణాళిక సిద్ధం చేసింది. పోటీల నిర్వహణలో పారదర్శకత, పకడ్బందీగా ఉండేలా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు, పోలీస్‌అధికారులు, క్రీడాశాఖాధికారులు, ఒలింపిక్ సంఘం ప్రతినిధులు భాగస్వాములను చేశారు.
కమిటీల ఏర్పాట్లు
పంచాయతీస్థాయిలో 17 నుంచి 22వ తేదీ వరకు జరిగే పోటీలకు సర్పంచ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మండలస్థాయిలో 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే పోటీలకు ఎంపీడీఓ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎంఈఓ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మెంబర్ కన్వీనర్, తహసీల్దార్ సభ్యులుగా ఉంటారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థాయిలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే పోటీలకు మున్సిపల్ కమిషనర్ మెంబర్ కన్వీనర్, తహసీల్దార్, ఎంఈఓ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సభ్యులుగా వ్యవహరిస్తారు. నియోజకవర్గ స్థాయిలో ఫిబ్రవరి 9 నుంచి 12వ తేదీ వరకు జరిగే పోటీలకు ఎమ్మెల్యే చైర్మన్ వ్యవహరిస్తారు. రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ద్వారా నియామకమైన అధికారి చైర్మన్, డీవైఎస్‌ఓ వైస్ చైర్మన్‌గా, ఎంఈఓ కన్వీనర్, తహసీల్దార్, ఒలింపిక్ సంఘం బాధ్యులు, క్రీడా విశ్లేషకులు కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. జిల్లాస్థాయిలో 20 నుంచి 23వ తేదీ వరకు జరిగే పోటీలకు ఇన్‌చార్జ్‌గా మంత్రి చైర్మన్‌గా, కలెక్టర్ కో–చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
వచ్చే నెల 12వ తేదీ వరకు నిర్వహించే సీఎం కప్ క్రీడాపోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి. క్రీడాకారులు తమ ప్రతిభను వెలికి తీసేవిధంగా ఈ పోటీలు ఉపయోగపడుతాయి.
– రిజ్వాన్ బాషా, కలెక్టర్, క్రీడల కన్వీనర్
సీఎం కప్ క్రీడాపోటీలు షురూ


