ఉత్కంఠకు నేటితో తెర
జనగామ,స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల వివరాలు
చైర్మన్ పదవులు వీరికి చాన్స్..?
పురపాలిక వార్డుల రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన
జనగామ: జనగామ, స్టేషన్‌న ఘన్‌పూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికల సన్నాహాల్లో వేగం పుంజుకుంది. మూడు రోజుల క్రితం వార్డుల వారీ రిజర్వేషన్లను ఖరారు చేసిన అధికారులు, ఆ వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచారు. ఈనెల 17న (శనివారం) జనగామ కలెక్టరేట్‌లో రెండు మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లను అధికారికంగా వెల్లడించనున్నారు. అదే రోజు అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ పద్ధతిలో మహిళా రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన బీసీలకు 32 శాతం, ఎస్సీలకు 13, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు ఖరారు కాగా, మిగతా 50 శాతం జనరల్ కేటగిరీకి కేటా యించారు. ప్రతీ వర్గంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తైన వెంటనే ఆ వివరాలను సీడీఎంఏకు పంపించి, ఫైనల్ గెజిట్‌కు అనుమతి వచ్చిన తర్వాతే అధికారిక వార్డుల రిజర్వేషన్ల జాబితా విడుదల చేయనున్నారు. ఈనెల 18న జరగనున్న కేబినెట్ సమావేశం తర్వాత, 19 లేదా 20 తేదీల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశమున్నట్లు సమాచారం. వచ్చేనెల ఫిబ్రవరి 10 నుంచి 12 మధ్య ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసి ఆ తర్వాత ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
పురపాలిక ఎన్నికలకు సంబంధించి ఈసారి రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారవుతున్న నేపథ్యంలో, గత ఐదేళ్లుగా ఒకే వార్డులో క్రమంగా ప్రజల్లో అనుబంధం పెంచుకున్న పలువురు ఆశావాహులకు షాక్ తగలవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్నో సంవత్సరాలుగా శ్రీసేఫ్ వార్డుశ్రీగా భావించి పని చేస్తున్న నేతలు ఇప్పుడు ఏ రిజర్వేషన్ వస్తుందో తెలియక గందరగోళంలో పడిపోతున్నారు. ఈ అనిశ్చితి కారణంగా కొంతమంది ఆశావాహులు ముందుగానే ఇతర సాధ్యమైన వార్డులపై కన్నేశారు. ఆ వార్డు నేతలు, ఓటర్లను సంప్రదించడం ప్రారంభించారు. తమ ప్రత్యర్థులకు పోటీలో ఉంటున్నట్లు ముందస్తు సంతేకాలు సైతం పంపిస్తున్నారు. రొటేషన్‌న్ విధానంలో రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉండదేమోననే అంచనాలతో ఇన్నాళ్లు కౌన్సిలర్‌గా బరిలో నిలవాలని విశ్వప్రయత్నం చేస్తున్న పలువురు బలహీన వర్గాల నాయకులు, ఒకవేళ జ నరల్ కేటగిరీ వస్తే కూడా పోటీకి సిద్ధమేనన్న ధోరణి ప్రదర్శిస్తున్నారు. బీసీలకు 32 శాతం రిజర్వేషన్ ఉన్నప్పటికీ, జనరల్ కేటగిరీలో కూడా ఆ వర్గానికి చెందిన అభ్యర్థులు ఎక్కువగానే నిలబడే అవకాశం ఉండడంతో పోటీ శాతం ఇంకా పెరగనుంది. రిజర్వేషన్ల జాబితా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వద్ద గోప్యంగా ఉండగా, శనివారం ప్రకటన కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్లలో ఉత్కంఠ నేపథ్యంలో ఈ రెండు మున్సిపాలిటీల రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించనుంది.
కలెక్టర్ వద్ద గోప్యంగా వివరాలు
లాటరీ ప్రక్రియలో
మహిళా రిజర్వేషన్లు ఎంపిక
మహిళకు 50శాతం...బీసీలకు
32 శాతం
రొటేషన్ పద్ధతిలో ఆశావహులకు షాక్
మున్సిపాలిటీ ఎస్టీ ఎస్సీజనరల్ ఎస్సీమహిళ బీసీజనరల్ బీసీమహిళ జనరల్ జనరల్ మహిళ
జనగామ 1 3 2 5 4 6 9
స్టేషన్‌ఘన్‌పూర్ 1 3 2 2 1 3 6
మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్‌కు సంబంధించి రాష్ట్రస్థాయిలో ఎంపిక చేయనున్న నేపథ్యంలో జనగామలో జన రల్ లేదా బీసీ కేటగిరీలో మహిళకు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్టేషన్‌ఘన్‌పూర్ విషయానికి వస్తే ఎస్సీ సామాజిక వర్గంలో జనరల్ లేదా మహిళకు రావచ్చని సమాచారం. శనివారం కలెక్టరేట్ సమావేశం హాలులో కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో మునిసిపల్ కమిషనర్లు మహేశ్వర్‌రెడ్డి, రాధాకృష్ణ, ఇతర అధికారుల పర్యవేక్షణలో వార్డుల వారీ రిజర్వేషన్లు, లాటరీ పద్ధతిలో మహిళా రిజర్వేషన్లను ఎంపిక చేయనున్నారు.


