శిగమూగిన ఆలేటి ఎల్లవ్వ జాతర
పాలకుర్తి టౌన్: మహిళల బోనాలు, డప్పుచప్పుళ్ల కోలాహలం, శివసత్తుల పూనకాలతో మండలంలోని బమ్మెర శివారులోని ఆలేటి ఎల్లవ్వ జాతర శిగమూగిపోయింది. శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు ఆలేటి ఎల్లవ్వ తల్లిని దర్శించుకున్నారు. మండలంలోని బమ్మెర, తొర్రూరు, అయ్యంగారిపల్లి, ఈరవెన్ను గ్రామాల నుంచి ఎడ్లబండ్లతో వచ్చి గుడి చుట్టు ప్రదక్షిణ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఎల్లవ్వ తల్లిని దర్శించుకున్నారు.
బోనమెత్తిన మాజీమంత్రి
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆలేటి ఎల్లవ్వను సందర్శించి ఆలయంలో బోనమెత్తుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే బమ్మెరతోపాటు నియోజకవర్గంలో పలు ఆయాలను పునరుద్ధరించి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వర్ధన్నపేట ఏసీపీ ఆంబటి నర్సయ్య, సీఐ జానకీరాంరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా బందోబస్తు నిర్వహించారు. పూజలు నిర్వహించిన వారిలో.. బీఆర్‌ఎస్ నాయకులు పల్లా సుందర్‌రాంరెడ్డి, నవీన్, నాగిరెడ్డి, శ్రీనివాస్‌రావు, ఎల్లయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, మార్కెట్ చైర్‌పర్సన్ లావుడ్యా మంజుల, బమ్మెర సర్పంచ్ జిట్టబోయిన రమ్యప్రశాంత్, అయ్యంగారిపల్లి సర్పంచ్ ముస్కు సుధాకర్, దార శంకరయ్య, గోనె మహేందర్, బత్తిని సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, ఆలేటి ఎల్లవ్వ జాతరలో గుడి వద్ద చెట్టుపై నాగుపాము ప్రతక్ష్యం కావడంతో ఆలేటి ఎల్లవ్వ స్వరూపంలోనే పాము ప్రత్యక్షమైందని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సంతానం లేని భక్తులు ఎల్లవ్వను దర్శించుకొని ఆలయ సమీపంలో తాటిచెట్టు వద్ద వరం పట్టడం ఆనవాయితీ.
ఆలయానికి పోటెత్తిన భక్తులు
బోనాలు, శివసత్తుల పూనకాలతో కోలాహలం
శిగమూగిన ఆలేటి ఎల్లవ్వ జాతర
శిగమూగిన ఆలేటి ఎల్లవ్వ జాతర


