ఐలోని మల్లన్న.. నీకు వేవేల దండాలు!
జఫర్‌గఢ్: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఐనవోలు మల్లన్నను ఇలవేల్పుగా కొలిచే యాదవుల సందడి అంతా ఇంతా కాదు. సంక్రాంతికి 15 రోజుల ముందుగానే యాదవులు తమ ఇళ్లకు సున్నాలు వేసి శుభ్రం చేస్తారు. అనంతరం రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు. సంక్రాంతి రోజు ఉదయాన్నే మహిళలు తమ ఇళ్లలోనే ఐనవోలు మల్లన్నకు ఎదురుబోనాలు సమర్పిస్తారు. సాయంత్రం సమయంలో యాదవ కులస్తులు పిల్లల నుంచి మొదులుకొని పెద్దలు, యువకులు కాళ్లకు గజ్జెలు కట్టుకొని గజ్జెలలాగులు ధరించి కళ్లకు రంగురంగుల అద్దాలు ధరించి ఒంటిపై వలలను కప్పుకొని డోలు వాయిద్యాలు, తాళాల చప్పట్ల నడుమ నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా ఐనవోలు మల్లన్న జాతరకు బయలుదేరుతారు. తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని యాదవ కులస్తులు ఇప్పటికీ కొనసాగిస్తుండడం విశేషం.
ఆధ్యాత్మిక చింతనతోనే
శాంతి సమాజం
దేవరుప్పుల: ఆయా సామాజికవర్గాలు ఆచరించే ఆధ్మాత్మిక చింతనతోనే శాంతి సమాజం వర్ధిల్లుతుందని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. బుధవారం మండలంలోని పెద్దమడూరుకు చెందిన జోగు బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రారంభమైన బంజర మల్లన్న స్వామి జాతర పురస్కరించుకొని సంప్రదాయపద్ధతిలో బోనాలు చేసి స్వామికి సమర్పించారు.ఈ సందర్బంగా జాతరను పరిశీలించేందుకు వచ్చిన డీసీపీ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు, యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. జాతరలో పటిష్టబందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సై ఊర సృజన్‌కుమార్, జోగు బ్రదర్స్ కుటుంబాలు, ఒగ్గు పూజారులు, కళాకారులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం
జనగామ: కాంగ్రెస్ ప్రభుత్వం తమ రాజకీయ క్రీడలో భాగంగా మంత్రులను బలిచేయడానికి టీవీ చానెళ్లకు లీకులు ఇచ్చి ఉపయోగించుకోవడం, మళ్లీ వారినే అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిట్ వేసి అర్ధరాత్రి అక్రమంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లి అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుతం పరిణామాలన్నీ డ్రామాలని ప్రజలకు తెలుసనీ, ఎమర్జెన్సీని తలపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే భేషరతుగా విడుదలచేయాలి డిమాండ్ చేశారు.
సమాజహితం కోసం యువత పాటుపడాలి
దేవరుప్పుల: జన్మనిచ్చిన గ్రామ సమాజ హితం కోసం యువత పాటుపడాలని కడప జిల్లా బద్వేల్ కోర్టు అడిషనల్ సివిల్ జడ్జి పెండెం ముఖేష్ కుమార్ సూచించారు. బుధవారం మండలంలోని సీతారాంపురం హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధి అంబటి యాకయ్య ఆధ్వర్యంలో తలపెట్టిన సంక్రాంతి పర్వదిన ప్రతిభాపాటవ, రోడ్డు భద్రత, క్రికెట్ క్రీడోత్సవాలను ఎస్సై ఊర సృజన్‌కుమార్‌తో ప్రారంభించారు. మోకిడి రాంబాబు కుటుంబం ఆధ్వర్యంలో క్రీడాకారులతోపాటు అనాథ శరణాలయ వృద్ధులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బస్వ ఎలేంద్రవెంకన్న, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు ఉప్పల సురేష్‌బాబు, బస్వ మల్లేషమ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూముల్ని కాపాడాలి
పాలకుర్తి టౌన్: పాలకుర్తిలో కోట్ల విలువైన ప్రభుత్వ ఆసైన్డ్, ఇనాం, కాందిశీకుల భూములు అన్యాక్రాంత అయ్యాయని, వాటిని ప్రజాఅవసరాలకు ఉపయోగించాలని సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేశ్‌రాజా, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శి గుమ్మడిరాజల సాంబయ్య డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతోజు రజిత, జీడి సోమన్న, కళింగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఐలోని మల్లన్న.. నీకు వేవేల దండాలు!
ఐలోని మల్లన్న.. నీకు వేవేల దండాలు!


