మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు
జనగామ: మున్సిపల్ రెండో సాధారణ ఎన్నికల నేపథ్యంలో వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో14ను విడుదల చేసింది. డెడికేటెడ్ కమిషన్ అందించిన రిపోర్టు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ నివేదికల ఆధారంగా ఎస్‌టీ, ఎస్‌సీ, బీసీ, మహిళలు, అన్‌రిజర్వుడ్ వర్గాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి టి.కె.శ్రీదేవి జారీ చేశారు.
రిజర్వేషన్ మార్గదర్శకాలు విడుదల
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డు రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. మొత్తం వార్డుల్లో 50 శాతం సీట్లు రిజర్వుడ్ వర్గాలకు, మిగతా 50 శాతం సీట్లు అన్ రిజర్వుడ్ వర్గాలకు కేటాయించే విధానాన్ని ప్రభుత్వం కొనసాగించింది. ఇదే సందర్భంలో స్థానిక సంస్థలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ నిబంధనను కచ్చితంగా అమలు చేస్తూ, మొత్తం వార్డులలో సగం స్థానాలు మహిళలకు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. కొత్త రిజర్వేషన్ కేటాయింపులతో జనగామ మున్సిపాలిటీ ఎన్నికల పరిస్థితులపై స్పష్టత నెలకొంది. ఇదిలా ఉండగా వార్డుల వారీగా రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక అధికారులు త్వరలోనే వెల్లడించనున్నారు. జనగామ వార్డు వారీగా రిజర్వేషన్ల ఖరారు ఇలా ఉంది. మొత్తం వార్డులు 30, ఎస్టీ జనరల్ 1, ఎస్సీ 5, ఎస్సీ జనరల్ 3, ఎస్సీమహిళ 2, బీసీ వర్గం మొత్తం 9, బీసీ మహిళ 4, బీసీ జనరల్ 5, మహిళా జనరల్ 9, జనరల్ (అన్ రిజర్వ్) 6 కేటాయించారు.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో..
స్టేషన్‌ఘన్‌పూర్: స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీలకు 2024 కులగణన ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేశారు. అదేవిధంగా జనరల్ మహిళలకు టీఎం చట్టం 2019 ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీలో మొత్తం 18 వార్డులు ఉండగా అందులో ఎస్టీలకు 1, ఎస్సీలకు 5, బీసీలకు 3, జనరల్‌కు 9 స్థానాలను కేటాయించారు. కాగా ఎస్టీలలో ఎస్టీ జనరల్‌కు 1 స్థానం, ఎస్సీలలో జనరల్ 3, మహిళలకు 2, బీసీలలో జనరల్ 2, మహిళలకు 1, ఓసీలలో జనరల్ 3, మహిళలకు 6 స్థానాలను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో అత్యధికంగా జనరల్‌కు ఏకంగా 9 స్థానాలు కేటాయించడం విశేషం. కాగా మొత్తం 18 వార్డులలో ఏ వార్డుకు ఏ రిజర్వేషన్లు అనేది రెండు రోజుల్లో తేలనున్నట్లు అధికారులు తెలిపారు.
జీవో జారీ చేసిన ప్రభుత్వం


