నేటి నుంచి ఆలేటి ఎల్లవ్వ జాతర
పాలకుర్తి టౌన్: భక్తుల కోరిన కోరికలు తీర్చే ఆలేటి ఎల్లవ్వ జాతర ఉత్సవాలు మండలంలోని బమ్మెర శివారు అయ్యంగారిపల్లి గ్రామ సమీపంలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ తెల్లారి కునుమ రోజున ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. జాతరను ఘనంగా నిర్వహించేందుకు బమ్మెర గ్రామ పంచాయతీ, ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. 15న రాత్రి ఆలయం చుట్టూ ఎడ్లబండ్లు తిరుగుడు, 16న బోనాలు, పట్నాలు శివసత్తులు నడుమ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. సంక్రాంతి పండుగ మరుసటి రోజు జరిగే కనుమ రోజున ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆలేటి ఎల్లమ్మ తల్లిని దర్శించుకునేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. సంతానం లేనివారు ఎల్లవ్వను దర్శించుకొని ఆలయం సమీపంలో ఉన్న తాటి చెట్టువద్ద వరంపడితే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. వరం పట్టే తాటి చెట్టుపై నుంచి పసుపు ముద్దలు పడతాయని నమ్ముతారు.
డీసీపీ పూజలు..
ఆలేటి ఎల్లవ్వ ఆలయాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. జాతర ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎస్సై దూలం పవన్‌కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నేటి నుంచి ఆలేటి ఎల్లవ్వ జాతర


