ముసాయిదా ఓటరు జాబితా విడుదల
జనగామ, స్టేషన్ ఘన్‌పూర్
మున్సి‘పోల్స్’కు రంగం సిద్ధం
జనగామ మున్సిపాలిటీలో వార్డుల వారీగా..
స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీలో..
జనగామ: జిల్లాలోని జనగామ మున్సిపాలిటీ, కొత్తగా ఏర్పడిన స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు గురువారం అధికారికంగా ప్రకటించారు. రెండు మున్సిపాలిటీల్లో కమిషనర్లు మహేశ్వర్‌రెడ్డి, రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఈ ఓటరు జాబితాను అన్ని వార్డుల్లో ప్ర జలకు అందుబాటులో ఉంచారు. రెండు పురపాలికల్లో 48 వార్డుల పరిధిలో 62,382 మంది ఓటర్లు ఉన్నారు. తుది ఓటర్ల జాబితాను ఈనెల 10వ తేదీన విడుదల చేయనుండగా, ఆ దిశగా కీలక కార్యాచరణ ప్రారంభమైంది.
ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియ కొనసాగుతోంది. చేర్పులు, తొలగింపుల విషయంలో ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు ఎన్నికల సంఘం నుంచి రాలేదు. ప్రస్తుతం ఒక కుటుంబం ఓట్లు రెండు వేర్వేరు వార్డుల్లో పడిన సందర్భాల్లో, అదే వార్డులో కలిపే అంశంగానే అభ్యంతరాలు స్వీక రిస్తారనే సమాచారం ఉంది. డిలీషన్ లేదా కొత్త చేర్పులపై ఇంకా స్పష్టత లేకపోవడంతో ప్రజలు, స్థానిక పార్టీల నాయకులు సందిగ్ధంలో ఉన్నారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునే అవకాశంపై కూడా ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం వెలువడలేదు. ముసాయిదా జాబితాను ప్రతి వార్డులో ప్రచురించడంతో ప్రజలు తమ ఓటు ఉన్నదా లేదా అన్నదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తమ పేర్లు వేరే వార్డులకు మారాయా అనే అనుమానాలతో అనేక మంది ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటూ, అభ్యంతరాల ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 5న మున్సిపల్ స్థాయిలో, 6న జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా 9వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి, 10న తుది ఓటరు జాబితాను వెలువరించనున్నారు. ముసాయిదా జాబితా వెలువడడంతో రెండు మున్సిపాలిటీలలో రాజకీయం వేడెక్కింది. తుది జాబితా విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో, పార్టీలు తమ వ్యూహాలను పునర్నిర్మాణం చేసుకుంటున్నాయి. కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాల పరిష్కారం వంటి అంశాలపై స్పష్టత వచ్చాక రాజకీయంగా మరింత కదలికలు కనిపించే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
అభ్యంతరాలు, తొలగింపు, చేర్పులపై
కరువైన స్పష్టత
10న తుది ఓటరు జాబితా
జనగామ మున్సిపల్‌లో 30 వార్డులు ఉండగా, మొత్తం 43,832 ఓటర్లు ఉన్నట్లు ముసాయిదా ఓటరు జాబితాలో చూపించారు. ఇందులో పురుషులు 21, 247, మహిళలు 22,576, ఇతరులు 9 మంది ఉన్నారు. అత్యధికంగా 13వ వార్డులో 1,930, 5వ వార్డులో 1,800, 4వ వార్డులో 1,749, 3వ వార్డులో 1,655, అతి తక్కువగా 20వ వార్డులో 1,156, 21వ వార్డులో 1,197 ఓటర్లు, 22వ వార్డులో 1,198, 24వ వార్డులో 1,256, 7వ వార్డులో 1,297 మంది ఓటర్లు ఉన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్‌లో 18 వార్డుల పరిధిలో 18,550 ఓటర్లు నమోదు కాగా, పురుషులు 8,913, మహిళలు 9,636, ఇతరులు ఒక్కరు ఉన్నారు. అత్యధిక ఓటర్లు 10వ వార్డులో 1,210 ఓటర్లు, 11వ వార్డులో 1,152 ఓటర్లు, 12వ వార్డులో 1,013 ఓటర్లు, అతితక్కువ ఓటర్లు 13వ వార్డులో 912, 15వ వార్డులో 933, 16వ వార్డులో 955 మంది ఓటర్లు ఉన్నారు. రెండు పురపాలికల్లో కూడా ఓటర్ల ధ్రువీకరణ చివరి దశకు చేరుకుంది. అంకెలు పరిశీలనలో ఎలాంటి లోపాలు లేకుండా డేటా నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.
ముసాయిదా ఓటరు జాబితా విడుదల


