నూతనోత్సాహం
కొత్త సంవత్సరానికి జిల్లావాసుల ఘన స్వాగతం
● సప్తవర్ణ ముగ్గులతో శోభితమైన లోగిళ్లు
● ఆలయాలకు పోటెత్తిన భక్తులు
● కేక్ కటింగ్, దావత్‌లతో పండగ వాతావరణం
జనగామ: జిల్లాలో నూతన సంవత్సరం వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లా ప్రజలు కోటి ఆశలతో గురువారం తెల్లవారుజాము వరకు కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. ఇళ్ల ముందు లోగిళ్లు రంగురంగుల ముగ్గులతో సప్తవర్ణ శోభితంగా అలంకరించగా, యువతీ యువకులు హోరెత్తించారు. డీసీపీ కార్యాలయంలో డీసీపీ,ఏఎస్పీ, ఏసీపీ, సీఐల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.
కొత్త సంవత్సరం పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. బచ్చన్నపేట మండలం సిద్దేశ్వరాలయం, చిల్పూరు శ్రీ బుగులు వెంకటేశ్వర, జనగామ చెన్నకేశ్వర, బాణాపురం శ్రీ వెంకటేశ్వరాలయం, శ్రీ ఆంజనేయస్వామి, యశ్వంతాపూర్ శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి, బతుకమ్మకుంట శ్రీ విజయదుర్గామాత, సాయిబాబా, పాలకుర్తి శ్రీసోమేశ్వరాలయం, జీడికల్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి తదితర ఆలయాలకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు. క్రైస్తవులు చర్చిలకు పెద్దఎత్తున తరలివెళ్లి ప్రార్థనలు నిర్వహించారు.
నూతనోత్సాహం


