కొత్త వెర్షన్ 1.0.3
యూరియా బుకింగ్‌కు నూతన వెర్షన్ యాప్
జనగామ: జిల్లాలో యూరియా పంపిణీ వ్యవస్థను పారదర్శకం, సులభతరంగా మార్చేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను పైలెట్ ప్రాజెక్ట్‌గా ఐదు జిల్లాల్లో అమలు చేయగా, వాటిలో జనగామ జిల్లా ఒకటి. జిల్లాలో రైతుల సౌకర్యార్థం కొత్త వెర్షన్ 1.0.3ను అందుబాటులోకి తీసుకు వచ్చి పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో 265 ఎరువుల పంపిణీ కేంద్రాలు ఉ న్నాయి. వీటిలో 23 ఆగ్రో సేవా కేంద్రాలు, 14 పీఏ సీఎస్, 29 హాకా కేంద్రాలు, 9 ఎఫ్‌ిపీఓలు, మార్క్ ఫెడ్ పరిధిలో 88 సొసైటీలు, 191 ప్రైవేట్ డీలర్లు రైతులకు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో వరి సాగు 1.30 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 15,846 ఎకరాల్లో సాగుతో పాటు ఇతర పంటలతో కలిపి మొత్తం 2.09 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ సా గుకు మొత్తం 26,980 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని గుర్తించిన అధికారులు, ఇప్పటి వరకు 12,985 మెట్రిక్ టన్నులను జిల్లాకు రవాణా చేశారు. అందులో రైతులు యాప్ ద్వారా 8,100 మెట్రిక్ టన్నుల యూరియాను కొనుగోలు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 36,200 యూరియా బస్తాల స్టాక్ అందుబాటులో ఉంది. పంటల వారీగా పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. వరికి ఎకరాకు 2.5 బస్తాలు, మొక్కజొన్నకు 3.5 బస్తాలు, మిర్చికి 5 బస్తాలు, ఇతర పంటలకు 2 బస్తాలు ఇవ్వనున్నారు. పంపిణీ వ్యవస్థలో చిన్న రైతులకు ఒకేసారి అవసరమైన యూరియాను అందిస్తుండగా, పెద్ద రైతులకు మాత్రం 15 రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు విడతల్లో పంపిణీ చేసేలా ప్రణాళికలను రూపొందించారు. ఒకసారి యూరియా తీసుకున్న తర్వాత తదుపరి బుకింగ్ కోసం 15 రోజుల విరామాన్ని పాటించాలి. యాప్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా బుక్ చేసుకుని, 12 మండలాల్లో ఏ కేంద్రంలోనైనా కొనుగోలు చేసే సౌకర్యం కల్పించారు.
యూరియా పంపిణీపై కలెక్టర్ రిజ్వాన్‌బాషా ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి అంబికా సోని పర్యవేక్షణలో ఏఓలు కె.విజయ్, ఆర్.శరత్ చంద్ర ఆధ్వర్యంలో ఏఈఓలు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. వీరికి పంచాయతీ సెక్రటరీలు, జీపీఓలు సైతం సహకారం అందిస్తున్నారు. యాప్‌లో బుకింగ్ చేసిన రైతులు 24 గంటల వ్యవధిలో బస్తాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే బుకింగ్ రద్దవుతుంది.
పంటల వారీగా, ఎక్కడి నుంచి
అయినా బుక్ చేసుకునే అవకాశం
24 గంటల్లో యూరియా
తీసుకోకుంటే రద్దు
జిల్లాలో 26,985 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం


