
పెసర్ల ధర పిసరంత!
న్యూస్‌రీల్
శనివారం శ్రీ 30 శ్రీ ఆగస్టు శ్రీ 2025
● జనగామ మార్కెట్‌లో ఒక్కసారిగా పతనం
● మూడు రోజుల వ్యవధిలో మూడు వేలకుపైగా వ్యత్యాసం
● అమ్మకానికి ససేమిరా అంటున్న రైతులు
● పెట్టుబడి సైతం రాదని ఆవేదన
● సరుకు నాణ్యత లేదంటున్న వ్యాపారులు
జనగామ: జిల్లా రైతులకు పెసర్ల ధరలు షాక్ ఇస్తున్నాయి. మూడు రోజులుగా క్వింటాల్‌కు రూ.7,800ల వరకు ధర పలికి శుక్రవారం ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అమ్ముకునేందుకు ససేమిరా అంటున్న రైతులు.. మంచి ధర రాకుంటే ఇంటికి తీసుకెళ్తామంటున్నారు. ఇంత తక్కువ ధరకు అమ్మితే పెట్టుబడి సైతం రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యార్డుకు వచ్చిన పెసర్లు నాణ్యత లేకపోవడంతోనే ధర ఇవ్వలేకపోతున్నామని వ్యాపారులు అంటుండగా..ఇదే సరుకును మూడు రోజుల క్రితం ఎక్కువ ధరకు ఎలా తీసుకున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ–నామ్ పద్ధతిలో పెసర్ల కొనుగోలుకు ఐదారుగురు వ్యాపారులు రావాల్సిన చోట.. ఒకేఒక్కరు రావడంలో పోటీ లేకుండాపోయింది. తమ శ్రమతో పండించిన పంటకు సరైన విలువ దక్కకపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
అమ్మకానికి నిరాకరణ
మార్కెట్‌కు పెసర్లను తీసుకొచ్చిన రైతులు ధరలు తగ్గిపోవడంతో అమ్మకానికి నిరాకరిస్తూ ఇంటికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు కొంతమంది రైతులు ప్రైవేటులో తీసుకొచ్చిన అప్పులను తీర్చేందుకు తక్కువ ధరకై నా పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత కష్టం చేసి పండించిన పంటకు కనీసం ఉత్పత్తి వ్యయం కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యవసాయం ఎలా చేయాలని వాపోతున్నారు. ఎక్కువ మంది ఖరీదుదారులు రావాల్సిన చోట ఒక్కరు మాత్రమే రావడం..ధరలు పడిపోవడానికి ప్రధాన కారణమని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. మార్కెట్‌లో లావాదేవీలు మందగించడంతో రైతులు, వ్యాపారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. పెసర్ల నాణ్యత ఆధారంగా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
25న రూ.7,800.. 29న రూ.4,700
జనగామ ఏఎంసీకి ఐదు రోజులుగా పెసర్లు వస్తున్నాయి. జిల్లాలో 7 వందల ఎకరాలకు పైగా పెసర పంట సాగుచేయగా.. మొదట్లో వర్షాభావ పరిస్థితుల్లో 20 శాతం పంట చేతికందకుండా పోగా, చాలా చోట్ల దిగుబడులు అమాంతం తగ్గాయి. ఉన్న పంటను అమ్ముకుందామంటే ధరలు తగ్గడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ నెల 25న క్వింటాల్ పెసర్ల ధరలు రూ.7,800, రూ.6,400, రూ.6,600 మూడు కేటగిరీల్లో ధర పలుకగా, 26న రూ.6,350, రూ.5,700, రూ.4,200 ధర ఇచ్చారు. 29న రూ.4,751, రూ.4,525, రూ.4,502 ధర మాత్రమే పలికింది. 25, 26 తేదీల్లో 151 క్వింటాళ్లు కొనుగోలు చేయగా, 29న మాత్రం 50 క్వింటాళ్ల సరుకు వాపస్ వెళ్లగా..వ్యాపారి 30 క్వింటాళ్లను కొనుగోలు చేశాడు.
అభ్యంతరాలుంటే తెలపండి
ఇంటికి తీసుకెళ్తున్నా..
నాలుగు ఎకరాల్లో పెసర పంట సాగు చేశా. పెట్టుబడులకు రూ.30వేల వరకు ఖర్చు అయ్యింది. 15 క్వింటాళ్ల దిగుబడి రావాలి. పంటసాగు చేసిన మొదట్లో వర్షాభావ పరిస్థితులతో 9 క్వింటాళ్ల దిగుబడి తగ్గింది. ఆరు క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. మార్కెట్‌లో నాలుగు రోజుల క్రితం క్వింటాల్ పెసర్లకు రూ.6వేల నుంచి రూ. 7,800 ధర పలుకగా.. ఇవాళ కేవలం రూ.4,750 ఇస్తామంటున్నారు.. ఇదేంటని అడిగితే మార్కెట్‌లో ధర పడిపోయిందని చెబుతున్నారు. సరుకును ఇంటికి తీసుకెళ్తున్నా..సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మార్కెట్‌లో ధర పలికితే అక్కడ అమ్ముకుంటా..
– ధరావత్ రవి,రైతు, బంజర, దేవరప్పుల

పెసర్ల ధర పిసరంత!

పెసర్ల ధర పిసరంత!

పెసర్ల ధర పిసరంత!

పెసర్ల ధర పిసరంత!