
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
జనగామ రూరల్: జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు అన్నారు. శుక్రవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో జీపీ కార్మికులు అవస్థలు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కనీస వేతనం రూ. 26,000లు ఇవ్వాలని, యూనిఫామ్, సబ్బులు, నూనెలు ఇవ్వాలని, ఇన్సూరెన్స్, పీఎఫ్, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి నారోజు రామచంద్రం, బస్వ రామచంద్రం, సాంబయ్య, యాకన్న, సంగీ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.