సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూశాఖలో అవినీతి పరాకాష్టకు చేరుతోంది. కొందరు తహసీల్దార్లు, అధికారులు అక్రమాదాయానికి కొత్తదారులు వెతుక్కుని మరీ అవినీతికి పాల్పడుతుండడం వివాదాస్పదమవుతోంది. కిందిస్థాయిలో పలువురు వీఆర్వోలు, వీఆర్‌ఏల నుంచి పైస్థాయిలో సర్వేయర్లు, ఇన్‌స్పెక్టర్లు, తహసీల్దార్ల వరకు అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతీ పనికి ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్న కొందరి తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చేయి తడిపితే తప్ప దస్త్రం కదిలించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఓ వైపు శాఖాపరమైన చర్యలు.. మరోవైపు ఏసీబీ దాడులు చేస్తున్నా కొందరు తహసీల్దార్ల తీరు మారడం లేదు. తాజాగా ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్‌రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. శుక్రవారం ఆయన ఇంటితో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై ఐదు చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ప్రాథమికంగా రూ.5 కోట్ల అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తుండడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపుతోంది.
ఆది నుంచి అవినీతి ఆరోపణలు.. 2022లో వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు..
ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించిన కేసులో అరెస్టయిన తహసీల్దార్ బండి నాగేశ్వర్‌రావుపై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ధర్మసాగర్, కాజీపేట, హసన్‌పర్తితోపాటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్‌లో పలుచోట్ల పనిచేసిన సమయంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు అధికారులు అందాయి. తహసీల్దార్ ఉద్యోగంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో భాగస్వామిగా చేరి రెండు చేతులా సంపాదిస్తూ ప్రభుత్వ, అసైన్డ్‌భూములను అప్పనంగా కట్టబెట్టారన్న ఫిర్యాదు మేరకు 2019లో అప్పుడున్న కలెక్టర్ విచారణ జరిపారు. ధర్మసాగర్ మండలంలోని ఓ గ్రామంలో గుట్టను విక్రయించి రిజిస్ట్రేషన్ చేసి పాస్‌పుస్తకాలు జారీ చేయడం వివాదంగా మారింది. 1976లో హసన్‌పర్తి శివారు కోమటిపల్లిలో కొనుగోలు చేసిన సీకేఎం కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్‌కు చెందిన 29 గుంటల భూమిని నగరానికి చెందిన ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేసి వారి నుంచి రూ.45 లక్షలు తీసుకున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈ విషయమై బాధితులు 2022లో అప్పటి సీపీ, డీసీపీ, ఏసీపీకి ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌తోపాటు ఆ ముగ్గురిపై చేసిన ఫిర్యాదుపై విచారణ జరిగినా ఇప్పటికీ నానుతోంది. వరంగల్, హైదరాబాద్‌లో విలాసవంతమైన భవనాలను నిర్మించడంతోపాటు ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగుచూడడంతో స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు కూడా ఆయన దరఖాస్తు చేసుకున్నారు. చివరకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దాడులు చేయడం చర్చనీయాంశమవుతోంది.
ఏసీబీ దాడులు చేస్తున్నా వెరవని వైనం..
● 2024లో భూసేకరణలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై వరంగల్ ఆర్డీఓ సిడాం దత్తును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
● అంతకుముందు వరంగల్ జిల్లా సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
● జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌లో ఏకంగా సంయుక్త పాలనాధికారి సీసీ రూ.45 వేలు తీసుకుంటూ అడ్డంగా దొరికాడు.
● హనుమకొండ జిల్లా నడికూడ మండల ఆర్‌ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
● భూపాలపల్లిలో రెవెన్యూ అధికారులకు లంచమివ్వాలని, లేదంటే తమ పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం లేదని వృద్ధ దంపతులు భిక్షాటన చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
● వెంకటాపూర్‌లో ఓ రైతు తనకున్న భూమిని పట్టా చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి, చివరకు విసిగిపోయి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు.
● ఇలా ఆరోపణలు వచ్చిన పలువురిపై బదిలీలు, సస్పెన్షన్, వీఆర్‌లో వేటు పడినా.. రాజకీయ పలుకుబడితో మళ్లీ కీలక మండలాల్లో పోస్టింగ్‌లు తెచ్చుకుని అదే తంతు కొనసాగిస్తున్నారు.
● నాలుగేళ్లలో అవినీతి నిరోధక శాఖ ఉమ్మడి జిల్లాలో 66కు పైగా వివిధ శాఖలకు చెందిన వారిని పట్టుకుంది. అందులో రెవెన్యూ శాఖదే అగ్రస్థానం ఉండడం గమనార్హం. అయినా ఆ శాఖలో పని చేస్తున్న కొందరిలో మార్పు రావడం లేదన్న చర్చ జరుగుతోంది.
అడ్డదారుల్లో కొందరు తహసీల్దార్లు, అధికారులు
భూసమస్యల పరిష్కారానికి రూ.లక్షల్లో డిమాండ్
తీవ్ర ఆరోపణలు వస్తున్నా.. మారని తీరు
ఆదాయానికి మించిన ఆస్తుల వివాదంలో బండి నాగేశ్వర్
ఏసీబీ దాడులతో మళ్లీ కలకలం.. రెవెన్యూ శాఖలో చర్చనీయాంశం
ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో ఫైళ్లు స్వాధీనం
ఖిలా వరంగల్: వరంగల్ ఫోర్ట్‌రోడ్డులోని ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. బీరువా, కౌంటర్లు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతీ ఫైల్‌ను పరిశీలించి కొన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మండల ఏర్పాటు నుంచి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
‘రెవెన్యూ’లో వేళ్లూనిన అవినీతి!