దేనికై నా సిద్ధమే
● సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా ఎదుర్కొంటా
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: సుప్రీంకోర్టు తీర్పు ఏ రకంగా వచ్చినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హల్‌లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గస్థాయి సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన కడియం మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని, ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఒక్కొక్క ఎంపీటీసీ స్థానానికి ఇద్దరు ఇన్‌చార్జ్‌లను నియమిస్తానని, వారు గ్రామంలోని అందరి అభిప్రాయాలు తీసుకుని రెండు, మూడు పేర్లను సిఫార్సు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, ఏఎంసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శిరీశ్‌రెడ్డి, నాయకులు సీహెచ్ నరేందర్‌రెడ్డి, బెలిదె వెంకన్న, చిల్పూరు దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, లింగాజీ, రంజిత్‌రెడ్డి, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


