పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి
జనగామ రూరల్: యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి ఇ.సుచరిత అన్నారు. శనివారం కోర్టు హాల్‌లో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. పొగాకు వినియోగంతో ముఖ్యంగా మౌత్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, కిడ్నీలు పాడై డయాలసిస్ వరకు వెళ్తున్నారని చెప్పారు. ఇంట్లోని పెద్దలు, ఫ్రెండ్స్‌తోపాటు సినిమాల ప్రభావం కారణంగా పొగాకు అలవాటుగా మారుతోందన్నారు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ఎక్సర్‌సైజ్, యోగా, వాకింగ్, రన్నింగ్ చేయాలని సూచించారు. డాక్టర్ కమలహాసన్ మాట్లాడుతూ.. 15 ఏళ్ల క్రితం 100 మందిలో ఇద్దరు లేదా ముగ్గురికి క్యాన్సర్ వచ్చేదని, ఇప్పుడు ఆ స్థాయి ఎక్కువగా పెరిగిందన్నారు. ఇందు కు పొగాకు ఎక్కువగా వాడటమే కారణమని పేర్కొన్నారు. అంతకు మందు విద్యార్థులు పారాలీగల్ వలంటీర్లతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.సందీప, లీగలైట్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ ఎం.రవీంద్ర, సోషల్ వర్కర్ ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఆస్పత్రిలో..
పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ర్యాలీ అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎన్‌సీడీ డాక్టర్ సుధీర్, డాక్టర్ కర్ణాకర్ రాజు, డాక్టర్ మధుకర్, డాక్టర్ కమలహాసన్, ఎన్‌సీడీ కోఆర్డినేటర్ రాజబాబు, భూక్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి సుచరిత


