’ఇరిగేషన్‌’లో ఏసీబీ గుబులు! | - | Sakshi
Sakshi News home page

’ఇరిగేషన్‌’లో ఏసీబీ గుబులు!

Apr 29 2025 7:13 AM | Updated on Apr 29 2025 7:13 AM

’ఇరిగేషన్‌’లో ఏసీబీ గుబులు!

’ఇరిగేషన్‌’లో ఏసీబీ గుబులు!

ఏసీబీ రంగప్రవేశం.. ఆందోళనలో ఇంజనీర్లు..

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : నీటిపారుదలశాఖలోని కొందరు ఇంజనీర్లలో మళ్లీ ఏసీబీ కలకలం మొదలైంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఆందోళనలో పడ్డారు. మేడిగడ్డ మొదలుకుని కన్నెపల్లి, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పలు ప్యాకేజీ పనుల్లో లొసుగులపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఇప్పటికే చాలామందిని విచారించిన ఆ కమిటీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు పరిధి వివిధ కేడర్ల లోని 17 మందిపై క్రిమినల్‌ కేసులు, 30 మందిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేశారు. ఇదే సమయంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికా రులు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తించి ప్రాజెక్టు ఎండీ హరిరామ్‌ ఇళ్లలో సోదాలు నిర్వహించి అరెస్టు చేయడం సంచలనంగా మారింది.

విచారణలతో ఉక్కిరిబిక్కిరి..

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించి న మేడిగడ్డ బ్యారేజీ కుంగి, పియర్లు దెబ్బతిన్న ఘటనలో తొలుత విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల సీపేజీపైనా విచారణ జరిపి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణాలపై వివరంగా నివేదించిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏకంగా 17 మంది సీనియర్‌ ఇంజనీర్లపై క్రిమినల్‌ కేసులకు సిఫార్సు చేసింది. అందులో అంతా మేడిగడ్డతో సంబంధం ఉన్నవారేనని తెలిసింది. నిర్మాణంతోపాటు డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్‌, ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌ తదితర విభాగాల్లో పనిచేసిన ఇంజనీర్లు ఉన్నట్లు ప్రకటించారు. క్రిమినల్‌ కేసుకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిఫార్సు చేసిన వారిలో కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుతోపాటు గతంలో ఎస్‌ఈగా పనిచేసిన రమణా రెడ్డి, ప్రస్తుత ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ తిరుపతి రావు సహా 17 మంది ఉన్నారు. శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసిన 30 మందిలో వివిధ విభాగాలకు చెందిన డీఈఈ, ఏఈఈలు ఉన్నట్లు తెలిసింది. నివేదికలో ఉన్న ఇంజనీర్ల పదోన్నతులను పరిశీలనకు తీసుకోవాలా లేదా తేల్చుకోలేక ఉన్నతాధికారులు పెండింగ్‌లో పెట్టారు.

అలాగే నిర్మాణ సమయంలో నాణ్యత తనిఖీ విభాగం, నిర్వహణ సమయంలో ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌ విభాగం ఇంజనీర్లు వైఫల్యం చెందినట్లుగా నిర్ధారించి, వారిపైనా కేసులకు సిఫార్సు చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించి మాజీ ఈఎన్సీ మురళీధర్‌, ప్రస్తుత చీఫ్‌ ఇంజనీర్‌ సుధాకర్‌ రెడ్డి తదితరులపైనా చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలుస్తున్నా.. శాఖాపరమైన చర్యలా? క్రిమినల్‌ చర్యలా? అన్నది తేలలేదు. ఏదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో చిక్కుకున్న పలువురు ఇంజనీర్లు విచారణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

చర్చనీయాంశంగా ఎండీ హరిరామ్‌పై దాడులు

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో

ఇక్కడి వాళ్లే..

ఇప్పటికే 17మందిపై క్రిమినల్‌ కేసులు

30మందిపై శాఖాపరమైన

చర్యలకు సిఫారసు

తాజాగా ఏసీబీ దాడులకు దిగడంతో కలకలం

ఆదాయానికి మించిన ఆస్తులే కారణం

ఎటు నుంచి ఎటొస్తుందోనన్న

ఆందోళన

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు వివాదంలో రంగంలోకి దిగిన ఏసీబీ.. ప్రాజెక్టులో ముఖ్య భూమిక పోషించిన నీటి పారుదల శాఖ గజ్వేల్‌ ఈఎన్‌సీ భుక్యా హరిరామ్‌పై దాడులు నిర్వహించడం నీటిపారుదలశాఖను కుదిపేసింది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాల నేపథ్యంలో శుక్రవారం, శనివారం దాడులు నిర్వహించి.. శనివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు ప్రకటించింది. మొత్తం ఆయన వద్ద ప్రాథమికంగా రూ.200 కోట్ల మేరకు అక్రమాస్తులుంటాయని భావించిన ఏసీబీ ఇంకా తనిఖీలు కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు అధికారుల ఆస్తుల గురించి కూడా ఏసీబీ ఆరా తీస్తుందన్న ప్రచారం ఇంజనీరింగ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో ఓ వైపు కొంద రు విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎన్‌డీఎస్‌ఏ, జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిటీ విచారణలు ఎదుర్కొంటుండగా.. మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తుల పేరిట ఏసీబీ దాడులు నిర్వహిస్తుండటంతో ఆరోపణలున్న ఇంజనీర్లలో ఆందోళన మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement